Begin typing your search above and press return to search.

వైద్యులు చనిపోతే 30 రోజుల్లో కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!

By:  Tupaki Desk   |   28 Aug 2020 10:15 AM IST
వైద్యులు చనిపోతే 30 రోజుల్లో కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!
X
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి భారీగా పెరుగుతుంది. ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ఏపీలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విపరీతంగా కరోనా పరీక్షలు చేస్తూ .. సరైన నిబంధనలు పాటించేలా చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. గత కొన్ని రోజుల్లో రోజుకి 10 వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజానీకంతో పాటుగా ప్రముఖులు , ప్రజాప్రతినిధులు , ఎమ్మెల్యేలు , కరోనా వారియర్స్ గా ముందు ఉండి నివారణ చర్యలు తీసుకుంటున్న వైద్యులు , పోలీసులు , పరిశుద్ధ కార్మికులు ఇలా ప్రతి ఒక్కరు కరోనా భారిన పడుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రాణాలని తీసేస్తుంది అని తెలిసినా కూడా వృత్తి ధర్మం పాటిస్తూ ప్రభుత్వ వైద్యులు కరోనా బాధితులకి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వ వైద్యులకు భరోసా కల్పించేలా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ‌ విధుల్లో భాగంగా సేవలు చేస్తూ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు ఎవరైనా కరోనాతో మృతిచెందితే వారి కుటుంబంలో ఒకరికి 30 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదేశాలు జారీచేశారు. వైద్యుడు మరణించిన ఆస్పత్రి ఉన్న జిల్లాకు సంబంధించిన డీఎంహెచ్‌వో లేదా డీసీహెచ్‌ఎస్‌ లేదా బోధనాసుపత్రి అయితే సూపరింటెండెంట్‌ వెంటనే వివరాలు పంపించాలని, వివరాలు వచ్చిన వెంటనే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.

ఇకపోతే , ఇప్పటివరకు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల కేసుల సంఖ్య 3,93,090కు చేరింది. గత 24 గంటల్లో 61,300 మందికి కరోనా వైరస్‌ పరీక్షలు చేయగా 10,621 మందికి పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 92 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 94,209 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 34,79,990 మందికి కరోనా పరీక్షలు చేశారు.