Begin typing your search above and press return to search.

ప్రత్యేక రాష్ట్రం అన్నాడు.. పదవి పోగొట్టుకున్నాడు

By:  Tupaki Desk   |   23 March 2016 10:43 AM IST
ప్రత్యేక రాష్ట్రం అన్నాడు.. పదవి పోగొట్టుకున్నాడు
X
ప్రత్యేక రాష్ట్రమన్న నినాదం ఎంత శక్తివంతమైనది దేశంలోని పలు రాష్ట్రాలకు అర్థమైనట్లుంది. ఏపీ విభజన అనంతరం.. మిగిలిన రాష్ట్రాలు అలెర్ట్ గా ఉన్నాయి. విభజన నినాదం వినిపిస్తే చాలు.. వాటికి మందు వేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్న విషయాన్ని తాజాగా మహారాష్ట్ర సర్కారు చేతల్లో చేసి చూపించింది.

ఆ రాష్ట్రానికి చెందిన అడ్వకేట్ జనరల్.. ఒక కార్యక్రమానికి హాజరై.. దశాబ్దాల నుంచి వినిపించే విదర్భ రాష్ట్ర డిమాండ్ ను వినిపించారు. విదర్భ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మహారాష్ట్రలోని విదర్భ.. మరట్వాడ ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాలుగా కోరుకుంటున్నాయి. కానీ.. ప్రధాన రాజకీయ పార్టీలేవీ అందుకు సిద్ధంగా లేకపోవటంతో.. ఆ నినాదం బలపడటం లేదు.

తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన అడ్వకేట్ జనరల్ శ్రీహరి.. విదర్భ ప్రజల ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించాడు. అంతే.. ఈ వ్యవహారం మహా అసెంబ్లీలో రచ్చగా మారటమే కాదు.. ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ భారీగా వినిపించింది. దీనికి స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. అడ్వకేట్ జనరల్ తన పదవికి రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రత్యేక గళం వినిపిస్తే చాలు.. మళ్లీ వినిపించకుండా ఉండేలా గొంతు నొక్కేయటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుందే..?