Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లకు నిద్ర లేచారు.. రేట్లు ఫిక్స్ చేశారు

By:  Tupaki Desk   |   22 March 2020 9:47 AM IST
ఇన్నాళ్లకు నిద్ర లేచారు.. రేట్లు ఫిక్స్ చేశారు
X
మాటల్లో చెప్పటానికి.. చేతల్లో చేసి చూపించటానికి మధ్య దూరం చాలానే ఉంటుంది. ఇట్టే చెప్పే మాటలు.. అమల్లోకి రావటం అంత తేలికైన విషయం కాదు. మోడీ లాంటి ప్రధాని దేశం చేసుకున్న అదృష్టంగా అభివర్ణించే వారు దేశంలో కుప్పలు కుప్పలుగా ఉంటారు. నిజానికి ఇదే ఆయనకు పెద్ద ఇబ్బంది అని చెప్పాలి. ఎప్పుడైనా.. ఎక్కడైనా సమర్థుడన్నోడు ఉంటే.. అతగాడి మీద అంచనాలు భారీగా ఉంటాయి. దీంతో.. ఏం చేసినా ఒక పట్టాన నచ్చదు. ఎందుకంటే సమర్థుడి స్థాయి చాలా ఎక్కువగా ఊహించుకోవటమే.

మోడీ లాంటి జూబ్లియంట్ ప్రధానమంత్రి దేశానికి ఉన్నప్పుడు కరోనా లాంటి పిల్లకాకి మీద పడకుండా ఉండటానికి గట్టి చర్యలు చాలానే తీసుకోవాలి కదా? అన్న సందేహం కొందరి నోట వినిపిస్తుంటుంది. ఎంత మోడీ మీద అభిమానం ఉంటే మాత్రం.. కరోనాను పిల్లకాకితో పోలుస్తారా? అంటే.. ఇప్పటికి ఈ వైరస్ తీవ్రత ఎంతన్న విషయం మీద దేశ వాసుల్లో ఉన్న అవగాహన నేపథ్యంలో.. ఇలాంటి కామెంట్లు చేసినా తప్పు లేదు.

ఎందుకంటే.. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్ ను కేవలం పద్నాలుగు గంటల వ్యవధిలో లింక్ బ్రేక్ చేసే అద్భుతమైన ఐడియా మోడీ మాష్టారి నోటి నుంచి వచ్చేసిందంటూ గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న తీరు చూస్తే.. ఇలాంటి భావన కలగటం తప్పేం కాదు. అదే సమయంలో.. ప్రచారం పక్కదారి పట్టేసి.. విషయాల్ని మోతాదు మించి గొప్పలు చెప్పేస్తున్న వైనాన్ని కమలనాథుల్లో ఏ ఒక్కరు ఖండించటం లేదు సరికదా.. మరింతగా చెలరేగిపోతున్నారు.

ఏతావాతా చెప్పేదేమంటే.. ప్రధాని మోడీ సూపరు. కరోనా లాంటి వైరస్ ను కంట్రోల్ చేసే సత్తా ఆయన సొంతం. ఈ ధీమానే కావొచ్చు.. చిన్న చిన్న అంశాల మీద మోడీ ప్రభుత్వంలోని కీలక అధికారులు పెద్దగా ఫోకస్ చేయలేదేమో? కరోనా డేంజర్ బెల్ ఫిబ్రవరిలోనే మన ముందుకు వచ్చినా.. దాన్ని ఫీల్ అయ్యేలా చేసింది మాత్రం మార్చి తర్వాతే. ఆ వెంటనే మిగిలిన దేశాల్లో మాదిరి మాస్కులు.. శానిటైజర్ల కొరత చోటు చేసుకుంది. మార్కెట్లలో ఈ రెండు దొరక్కపోవటం ఒకటైతే.. వాటి ధరలు ఆకాశానికి ఎగబాకాయి.

కరోనా నేపథ్యంలో.. ప్రాథమికంగా అవసరమైన కొన్నింటిలో మాస్కులు.. శానిటైజర్లు చాలా అవసరం. ఈ విషయాన్ని కాస్త ముందుగా గుర్తించి.. వాటి ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకోవటంతో పాటు.. ధరల విషయంలో ముందే కఠిన ఆదేశాలు జారీ చేసి ఉంటే బాగుండేది. కానీ.. కరోనా స్టేజ్ టులోకి అడుగు పెట్టి.. రేపో.. మాపో మూడో దశలోకి ఎంటర్ అవుతామన్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచింది. దేశంలో మాస్కులు.. శానిటైజర్ల ధరల్ని కంట్రోల్ చేసేందుకు కొత్త ఆదేశాలు జారీ చేసింది.

తాజాగా డిసైడ్ చేసిన దాని ప్రకారం మూడు పొరల మాస్కును రూ.10 డిసైడ్ చేసింది. రెండు పొరల సర్జికల్ మాస్కును రూ.8 అమ్మాలని తేల్చింది. ఇక.. శానిటైజర్ విషయానికి వస్తే.. 200 మిల్లీ లీటర్ల లిక్విడ్ బాటిల్ ను రూ.100కు అమ్మకూడదని ఫిక్స్ చేసింది. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. వావ్.. అమేజింగ్.. ఇన్నాళ్లకైనా వీటి ధరల విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నారనే. నిర్ణయం తీసుకోవటం ఇప్పటికైనప్పుడు.. ఇవన్నీ అమల్లోకి ఎప్పటికి వస్తాయో?అన్న అనుమానం రావటం తప్పేమీ కాదు.