Begin typing your search above and press return to search.

త‌న ప్ర‌త్య‌ర్థికి తొలి నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   9 Jan 2019 10:01 AM IST
త‌న ప్ర‌త్య‌ర్థికి తొలి నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చిన కేసీఆర్‌
X
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీ రెండో ద‌ఫా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తొలి నామినేటెడ్ ప‌ద‌వి భ‌ర్తీ అయింది. రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ ప‌ద‌వికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓకే చెప్పేశారు. త‌న సొంత జిల్లా అయిన‌ సిద్దిపేట మండలం ఇర్కోడు గ్రామానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డిని నియమించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకంచేశారు. అయితే, శ్రీ‌నివాస్‌ రెడ్డికి ఈ ప‌ద‌వి ద‌క్క‌డం వెనుక‌ - గులాబీ ద‌ళ‌ప‌తి నిర్ణ‌యం వెనుక ఉన్న లెక్క‌ల‌ను ప‌లువురు వివ‌రిస్తున్నారు.

ఇర్కోడు సర్పంచ్‌ గా 1987 రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన.. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 1994 నుంచి సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌ గా వరుసగా మూడుసార్లు పనిచేశారు. కేసీఆర్ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత 2001లో జరిగిన ఉప ఎన్నికలో శ్రీనివాస్‌ రెడ్డి టీడీపీ తరఫున సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి కేసీఆర్ చేతిలో ఓడిపోయారు! అనంత‌రం శ్రీనివాస్‌ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ఉద్యమ పార్టీ టీఆర్ ఎస్‌ లో చేరారు.!! నాటి నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కేసీఆర్ వెన్నంటే ఉండి అంచలంచెలుగా ఎదిగారు. నాటినుంచి దాదాపు పార్టీకి సంబంధించిన ప్రతి బహిరంగ సభ ఏర్పాట్లలో శ్రీనివాస్‌ రెడ్డి పాత్ర ఉంది. టీఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీ అభివృద్ధికి కృషిచేశారు. ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర సివిల్‌ స‌ప్లై కార్పొరేషన్ చైర్మన్‌ గా నియమించారు.

ఒక‌నాటి త‌న ప్ర‌త్య‌ర్థి అయిన వ్య‌క్తి పార్టీలో చేర‌డం...ఆనాటి నుంచి స‌న్నిహితుడిగా మార‌డం...త‌ర్వాత ఆయ‌న‌కు అటు పార్టీలో ముఖ్య‌మైన‌ నామినేటెడ్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం - అంతేకాకుండా..తెలంగాణ రెండో ద‌ఫా స‌ర్కారు ఏర్పాటు చేసిన అనంత‌రం క‌ట్ట‌బెట్టిన తొలి నామినేటెడ్ ప‌ద‌వి ఆయ‌న‌దే కావ‌డం...ఆస‌క్తిక‌ర‌మేన‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.