Begin typing your search above and press return to search.

కోర్టు ధిక్కరణ.. ప్రభుత్వాలనే నేరుగా ప్రశ్నించి సంచలనం సృష్టించిన ఎన్వీ రమణ

By:  Tupaki Desk   |   30 April 2022 11:30 AM GMT
కోర్టు ధిక్కరణ.. ప్రభుత్వాలనే నేరుగా ప్రశ్నించి సంచలనం సృష్టించిన ఎన్వీ రమణ
X
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థలు స్తంభాలాంటివి. ఇందులో ఏది సరిగా పనిచేయకపోయినా.. ఒకరినొకరు గౌరవించకపోయినా అనర్థానికి దారితీస్తుంది. గాడితప్పుతున్న ప్రభుత్వాలను న్యాయవ్యవస్థ గాడినపెడుతుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వాలు న్యాయవ్యవస్థను పట్టించుకోవడం లేదన్న ఆవేదన న్యాయమూర్తుల్లో నెలకొంది. తాజాగా ప్రభుత్వాల తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఓపెన్ గానే ఫైర్ అయ్యారు. అదిప్పుడు సంచలనమైంది.

న్యాయవ్యవస్థ ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని.. అందువల్ల దేశంలో కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యక్తం చేసిన ఆందోళన ఇప్పుడు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే విధంగా దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమని రమణ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రభుత్వాలను బలంగా తాకుతున్నాయి.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా జరిగిన హైకోర్టు సీజేఐలు, ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సులో ఎన్వీ రమణ మాటలు ఇప్పుడు ప్రభుత్వాల తీరును ఎండగట్టేలా ఉన్నాయి. ప్రధాని మోడీ, దేశంలోని సీఎంల సమక్షంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆ ప్రభుత్వాలు న్యాయవ్యవస్థ విషయంలో ఎంతగా నిర్లక్ష్యం వహిస్తున్నాయో అందరికీ అర్తమవుతోంది.

గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న వ్యక్తులు ఎవరూ ప్రభుత్వాలపై నేరుగా యుద్ధానికి దిగిన దాఖలాలు లేవు. కానీ చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ వచ్చాక ప్రభుత్వాలనే ఆదేశిస్తూ.. ప్రశ్నిస్తూ.. రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరోనా వేళ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వని మోడీ సర్కార్ పై ఇదే సుప్రీం చీఫ్ జస్టిస్ ‘మీరు ఉచితంగా ఇస్తారా? మేం ఆదేశాలు ఇవ్వలా? దేశ ప్రజల కోసం ఆ మాత్రం భరించలేరా?’ అని నేరుగా ప్రశ్నించారు.

ఇక మొన్నటి హిజాబ్ వివాదం.. యూపీలో లఖీంపూర్ ఖేరీ.. ఢిల్లీలో పంజాబ్ రైతుల ఆందోళన విషయంలో ప్రభుత్వాలను నేరుగా తప్పుపట్టిన ఘనత సుప్రీం కోర్టుది. అయితే ఇంత తప్పు పట్టినా ప్రభుత్వాలు మాత్రం తమ మాట వినడం లేదని.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నాయని సుప్రీం చీఫ్ జస్టిస్ నేరుగా విమర్శించారు. ఆయన విమర్శలు అటు సుప్రీంకోర్టును.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను బలంగా తాకాయి.

న్యాయవ్యవస్థకు అసలు ప్రభుత్వాలు గౌరవం ఇవ్వడం లేదన్న ఆయన వ్యాఖ్యలతో ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి..? ప్రధాని ముందే ఈ వ్యాఖ్యలు చేసిన ఎన్వీరమణ తీరుతో ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది వేచిచూడాలి.