Begin typing your search above and press return to search.

రోజా పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   21 March 2016 10:00 AM GMT
రోజా పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఎమ్మెల్యే
X
వైసీపీ ఎమ్మెల్యే - వివాదాస్పద నేత రోజా అసెంబ్లీలో ఏనాడూ సమస్యలపై మాట్లాడలేదని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ అన్నారు. ఏపీ శాసనసభలో ప్రివిలేజెస్‌ కమిటీ నివేదికపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... రోజా ఏ రోజూ సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించడం తాను చూడలేదన్నారు. రాజ్యాంగానికి లోబడే దేశంలో ప్రతి వ్యవస్థ పని చేయాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సార్లు సవరణలు జరుగుతాయన్నారు. రాజ్యాంగానికి లోబడే రోజాపై చర్యలు తీసుకున్నామా అనేది విశ్లేషించాలని అన్నారు. సభా నియమాలపై కొత్త సభ్యులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కాగా శివాజీ చాలా సీనియర్ నేత. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రముఖ సోషలిస్టు పార్టీ నేత గౌతు లచ్చన్న తనయుడు. దివంగత ఎర్రన్నాయుడుకి అత్యంత ఆత్మీయుడు. వివాదాలకు దూరంగా, ముక్కుసూటిగా ఉండే శివాజీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. తప్పు చేస్తే ఎవరినైనా మొఖం మీదే చెప్పేసే ఈ నేత రోజా పట్ల చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. శివాజీ లాంటి వ్యక్తే రోజాను తప్పు పట్టారంటే ఆమె పద్ధతి బాగులేనట్లేనని పలువురు ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు.

కాగా సభా సమయాన్ని వృథా చేసిన వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్షమాపణలు చెప్పాలని మంత్రి బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. తీర్మానాల పేరుతో సభా సమయాన్ని వృధా చేశారని, సభ గౌరవాన్ని మంట కలిపేలా వైఎస్‌ ఆర్‌ సిపి సభ్యులు ప్రవర్తించారని ఆయన అన్నారు. సభలో ఇటీవల జరిగిన సంఘటనలు దురదృష్టకరమైనవని ఆయన చెప్పారు. తోటి మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన తీరు తనను బాధించిందని ఆయన అన్నారు. సభకు ఉన్న హక్కులను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఆయన సూచించారు.