Begin typing your search above and press return to search.

క‌ర‌ణం బ‌ల‌రాం కుర్చీ ఎందుకు ఎత్తారు?

By:  Tupaki Desk   |   1 Dec 2017 7:03 AM GMT
క‌ర‌ణం బ‌ల‌రాం కుర్చీ ఎందుకు ఎత్తారు?
X
అధిప‌త్యం అంతా మ‌న‌దు ఉండాల‌న్న కుక్కుర్తి .. ఏపీ అధికార‌ప‌క్షంలో త‌మ్ముళ్ల మ‌ధ్య క‌త్తులు దూసుకునేలా చేస్తోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో ఒకే ఒర‌లో రెండు క‌త్తుల్ని పెట్టే ప్ర‌య‌త్నం చేసిన బాబుకు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని చెప్పుకునే తెలుగుదేశంలో ఇప్పుడు ప‌రిస్థితి మొత్తంగా మారిపోయింది. మంత్రుల స‌మ‌క్షంలో ఇరువురు నేత‌లు బాహాబాహీ వ‌ర‌కూ వెళ్లిన వైనం సంచ‌ల‌నంగా మారింది.

ఏపీ రాష్ట్ర రాజ‌ధానిలో చోటు చేసుకున్న ఈ వైనం ఇప్పుడు అధికార‌పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అధినేత ఏం చేస్తార‌న్న ధీమాతో పాటు.. త‌మ అధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికి పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను తాక‌ట్టు పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్న వైనం పార్టీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్ర‌కాశం జిల్లాకు చెందిన క‌ర‌ణం బ‌ల‌రాం.. గొట్టిపాటి ర‌వికుమార్ ల‌మ‌ధ్య‌నున్న రాజ‌కీయ గొడ‌వ‌లు తెలుగుప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వీరిద్ద‌రిని ఒకే గొడుగు కింద‌కు తేవాల‌న్న బాబు ప్ర‌య‌త్నం అట్ట‌ర్ ఫ్లాప్ కావ‌ట‌మే కాదు.. కొత్త త‌ర‌హా స‌మ‌స్య‌ల‌కు తెర తీస్తోంది.

అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో ప్ర‌తి నెలా జ‌రిగే జిల్లా పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో భాగంగా చోటు చేసుకున్న ర‌చ్చ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మంత్రి శిద్దా ఛాంబ‌ర్ లో చోటు చేసుకున్న స‌మావేశానికి ప‌లువురు నేత‌ల‌తో పాటు క‌ర‌ణం బ‌ల‌రాం.. గొట్టిపాటి ర‌వికుమార్ లు హాజ‌ర‌య్యారు.

జిల్లాకు ఇన్ చార్జ్ మంత్రి అయిన మంత్రి నారాయ‌ణ రావ‌టానికి ముందే ప్ర‌కాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్ స‌మావేశాన్ని ప్రారంభించారు. అజెండాలో తొమ్మిదో అంశం ఊహించ‌ని ప‌రిణామాల‌కు కార‌ణ‌మైంది. పాల‌క మండ‌ళ్ల నియామ‌కం జ‌ర‌గ‌ని మార్కెట్ క‌మిటీల అంశం ప్ర‌స్తావ‌న వ‌చ్చిన వెంట‌నే ప‌ర్చూరు ఎమ్మెల్యే సాంబ‌శివ‌రావు జోక్యం చేసుకున్నారు. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంతో సంబంధం ఉన్న మార్టూరు మార్కెట్ క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌విని తాను సూచించిన వారికి కేటాయించాని కోరారు. దీనికి స్పందించిన క‌ర‌ణం బ‌ల‌రాం.. ఛైర్మ‌న్ ప‌ద‌విలో మీకు ఇష్టమైన వారినే నియ‌మించుకోండ‌న్నారు. అక్క‌డితో ఆగ‌ని ఆయ‌న‌.. కొత్త‌గా వ‌చ్చిన వారితో మ‌న‌కేం ప‌ని.. వారు అనేక స‌మ‌స్య‌లు సృష్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇదంతా కూడా గొట్టిపాటిని టార్గెట్ చేస్తూ బ‌ల‌రాం వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

దీనికి స్పందించిన గొట్టిపాటి ర‌వికుమార్ రియాక్ట్ అవుతూ.. తానుపార్టీలో చేరి ఏడాదిన్న‌రేన‌ని.. రెండేళ్ల నుంచి మార్కెట్ క‌మిటీ ప‌ద‌విని ఎందుకు నియ‌మించుకోలేక‌పోయారు? ఇప్పుడు నా మీద ఎందుకు ప‌డ‌తారు? అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. దీనికి బ‌ల‌రాం స్పందిస్తూ.. శింగ‌ర‌కొండ దేవ‌స్థాన పాల‌క మండ‌లి నియామ‌కాన్ని ఆప‌లేదా? ఫించ‌న్లు.. ఇళ్లు రాకుండా చేయ‌లేదా? అంటూ ఆగ్ర‌హంగా మాట్లాడ‌టం.. దీనికి అంతే ఆవేశంగా ర‌వికుమార్‌.. ఎవ‌రు ఆపారు? ఎందుకు ఆపారు? ప‌్ర‌తి సంద‌ర్భంలోనూ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడుతున్నారు.. ఇలా అయితే కుద‌ర‌దు.. దేనికైనా రెఢీ? అని వ్యాఖ్యానించారు.

దీనికి బ‌ల‌రాం ఆగ్ర‌హం చెందుతూ పార్టీ మారినోళ్లు మాట్లాడితే కుద‌ర‌ద‌న్నారు. దీనికి అంతే ధీటుగా స్పందించిన గొట్టిపాటి.. తెలుగుదేశం పార్టీ పెట్టిన‌ప్పుడు పార్టీలో త‌మ కుటుంబ‌మే ఉంద‌ని.. మ‌ధ్య‌లో బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి వ‌చ్చామ‌ని.. ఎవ‌రికి ఇబ్బందులు వ‌చ్చిన‌ప్పుడు వారు పార్టీ మారార‌ని.. ఇప్పుడు నీతులు చెబితే బాగోదంటూ చుర‌క‌లేసిన‌ట్లుగా చెబుతున్నారు. దీంతో ఆవేశ ప‌డిపోయిన బ‌ల‌రాం ఏం మాట్లాడుతున్నావంటూ కుర్చీ ఎత్తి ముందుకు దూక‌బోగా.. ర‌వికుమార్ అంతే ఆగ్ర‌హంతో ముందుకు దూసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశార‌ని తెలుస్తోంది.

ఊహించ‌ని రీతిలో వ్య‌వ‌హారం వెళుతున్న వైనాన్ని గుర్తించిన నేత‌లు.. ఇరువురిని శాంతింప‌చేసే ప్ర‌య‌త్నం చేశారు. వీరి మ‌ధ్య ర‌చ్చ మ‌రోస్థాయికి వెళ్లింద‌న్న విష‌యాన్ని తెలుసుకున్న మంత్రి నారాయ‌ణ హుటాహుటిన మంత్రి ఛాంబ‌ర్‌ కు వ‌చ్చారు. బ‌ల‌రాంను నారాయ‌ణ స‌ముదాయించ‌గా.. ఇలా ఎంత‌కాలం ఆడిపోసుకుంటారంటూ గొట్టిపాటి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇరువురునేత‌ల్ని బుజ్జ‌గించేందుకు అధికార‌ప‌క్ష నేత‌లు కిందామీదా ప‌డ్డార‌ట‌.