Begin typing your search above and press return to search.

ప్రకాశం జిల్లా టీడీపీలో విభేదాలు

By:  Tupaki Desk   |   3 Aug 2016 11:15 AM GMT
ప్రకాశం జిల్లా టీడీపీలో విభేదాలు
X
ప్రకాశం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలకు - మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ టీడీపీ నేతలకు మధ్య పొసగని కారణంగా తరచూ ఘర్షణ వాతావరణ ఏర్పడుతోంది. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ - టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం వర్గాల మధ్య వివాదమేర్పడింది.

బుధవారం ఉదయం అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వచ్చారు. అయితే.. అదే సమయంలో టీడీపీ సీనియర్ కరణం బలరాం కూడా అధికారులతో నీటిపారుదల శాఖకు సంబంధించిన సమావేశానికి వచ్చారు. అధికారులంతా ఆయనతో సమావేశమయ్యారు.

మరోవైపు పింఛన్ల పంపిణీకి ఏర్పాటు చేసిన టెంట్లను బలరాం వర్గీయులు తొలగించి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పింఛన్ల పంపిణీకి తాను వస్తే ఇప్పుడు ఈ సమావేశాలు ఏంటని ఎమ్మెల్యే హోదాలో రవికుమార్ అధికారులను ప్రశ్నించారు. కానీ.. అధికారులు మౌనం వహించడంతో ఆయన రోడ్డుపైనే అయిదుగురికి పింఛన్లు పంపిణీ చేసి వెళ్లిపోయారు. అధికారుల తీరును సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని రవికుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.