Begin typing your search above and press return to search.

వైసీపీకి కొత్త టెన్ష‌న్‌!...మాధ‌వ్ రిజైన్ యాక్సెప్ట్ కాలేద‌ట‌!

By:  Tupaki Desk   |   20 March 2019 9:22 AM GMT
వైసీపీకి కొత్త టెన్ష‌న్‌!...మాధ‌వ్ రిజైన్ యాక్సెప్ట్ కాలేద‌ట‌!
X
ఎన్నిక‌ల పోలింగ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌ - నామినేష‌న్ల‌కు గ‌డువు ముంచుకువ‌స్తున్న వేళ‌... ఏపీలో విప‌క్ష వైసీపీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైపోయింది. ఆ పార్టీ ఇప్ప‌టిదాకా ప‌లు సంద‌ర్భాల్లో ఆరోపిస్తున్న‌ట్లుగానే ఏపీ పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కార‌ణంగానే ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఎదురైంద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. మొత్తంగా ఈ టెన్ష‌న్ ను వైసీపీ ఎలా మ‌ల‌చుకుంటుందోన‌న్న ఆస‌క్తి అయితే జ‌నాల్లో భారీగానే పెరిగిపోయింద‌ని చెప్పాలి. ఇప్ప‌టికే డీజీపీతో పాటు మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్ పోలీసు అధికారుల‌ను బ‌దిలీ చేయాలన్న త‌న డిమాండ్‌ ను వైసీపీ.. ఈ తాజా ఉదంతంతో మ‌రోమారు బ‌లంగా వినిపిస్తుందా? అన్న వాద‌న కూడా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఫ్యాక్ష‌న్ కక్ష‌లు బలంగా కొనసాగుతున్న అనంత‌పురం జిల్లాలో ఓ స‌ర్కిల్ ఇన్సెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న గోరంట్ల మాధ‌వ్‌... ఒకే ఒక్క సంఘ‌ట‌న‌తో హీరో అయిపోయారు.

జిల్లాలోని ప్ర‌బోధానంద ఆశ్ర‌మంతో నెల‌కొన్న పంచాయ‌తీ నేప‌థ్యంలో అనంత‌పురం ఎంపీ, టీడీపీ సీనియ‌ర్ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి ఓ పోలీసు అధికారిపై నోరు పారేసుకున్నారు. జేసీ వ్యాఖ్య‌లు నిజంగానే పోలీసుల మ‌నోధైర్యాన్ని దెబ్బ తీసే విధంగానే ఉన్నాయ‌న్న వాద‌న కూడా వినిపించింది. ఇదే కోణంలో ఆలోచించిన పోలీసు అధికారుల సంఘం కూడా జేసీకి కౌంట‌ర్ ఇవ్వ‌డానికి రెడీ అయిపోయింది. ఈ క్ర‌మంలోనే పోలీసు అధికారుల సంఘం అనంత‌పురం జిల్లా క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో రంగంలోకి దిగిన గోరంట్ల మాధ‌వ్‌... జేసీకి ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల‌తో పంచ్ ల‌తో కౌంట‌రిచ్చారు. ఈ ఒకే దెబ్బ‌కు గోరంట్ల హీరో అయిపోగా... జేసీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోవాల్సి వ‌చ్చింది. త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో గోరంట్ల త‌న పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి పారేసి... నేరుగా వైసీపీలో చేరిపోయారు. జేసీని ఢీకొట్టిన గోరంట్ల‌కు వైసీపీ అధినేత వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి కూడా రెడ్ కార్పెట్ స్వాగ‌తం ప‌లికారు. హిందూపురం పార్ల‌మెంటు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించేశారు. ఆ త‌ర్వాత ఏకంగా హిందూపురం ఎంపీ అభ్య‌ర్థిగానూ ఆయ‌న‌ను ప్ర‌క‌టించేశారు.

ఇంకేముంది.. సీఐ టూ ఎంపీ అంటూ గోరంట్లకు ఓ రేంజిలో ప్ర‌చారం హోరెత్తుతోంది. పార్టీ టికెట్ స‌రే... గెలవాలి క‌దా. గెల‌వాలంటే పోటీ చేయాలి క‌దా. పోటీ చేయాలంటే నామినేష‌న్ వేయాలి క‌దా. నామినేష‌న్ వేయాలంటే స‌ర్కారీ కొలువు ఉండ‌కూడ‌దు క‌దా. ఇదే లాజిక్‌ను ప‌ట్టేసుకున్న టీడీపీ... మాధ‌వ్‌కు చుక్క‌లు చూపేందుకు ప్లాన్ వేసిన‌ట్టుగా ప్ర‌చారం సాగుతోంది. ఈ ప్లాన్‌లో భాగంగా మాధ‌వ్ రాజీనామాను ఆమోదింప‌జేయ‌కుండా పోలీస్ శాఖ‌ను టీడీపీ మేనేజ్ చేసింద‌ట‌. అయితే త‌న ఉద్యోగానికి రాజీనామా చేసిన మాధ‌వ్‌... త‌న రాజీనామాను పోలీసు శాఖ ఆమోదించిందా? లేదా? అన్న విష‌యాన్నే ప‌ట్టించుకోలేద‌ట‌. అయితే తీరా నామినేష‌న్ల‌కు గ‌డువు ముగుస్తున్న ద‌శ‌లో పోలీసు శాఖే ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు తీసిన‌ట్టుగా తెలుస్తోంది.

మాధ‌వ్ రాజీనామాను పోలీసు శాఖ ఆమోదించ‌లేద‌ని, ఈ నేప‌థ్యంలో ఆయన నామినేష‌న్ ఎలా వేస్తార‌న్న అంశంపై ఇప్పుడు వైసీపీలో టెన్ష‌న్ నెల‌కొంద‌ట‌. విష‌యం తెలిసిన వెంట‌నే రంగంలోకి దిగిన మాద‌వ్‌... త‌న‌ను రాజ‌కీయంగా అడ్డుకునేందుకే టీడీపీ య‌త్నిస్తోంద‌ని, ఇందులో భాగంగానే పోలీసు శాఖను అడ్డుపెట్టుకుని త‌న రిజిగ్నేష‌న్‌ను ఆమోదింప‌జేయ‌కుండా నాట‌కాలు ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు. అంతేకాకుండా త‌న రాజీనామాను ఆమోదింప‌జేసుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల‌ను కూడా ఆయ‌న ప‌రిశీలిస్తున్న‌ట్లుగా స‌మాచారం. చూద్దాం.. ఈ మీసం మెలేసిన మాజీ పోలీస్... పొలిటిక‌ల్ హ‌ర్డిల్స్‌ను ఎలా అధిగ‌మిస్తారో?