Begin typing your search above and press return to search.

బోఫోర్స్ కంటే మోదీ భాగోతం పెద్ద‌దే!

By:  Tupaki Desk   |   3 April 2018 8:23 AM GMT
బోఫోర్స్ కంటే మోదీ భాగోతం పెద్ద‌దే!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ కొన‌సాగుతున్న ఉద్య‌మం నేప‌థ్యంలో అప్ప‌టిదాకా మిత్ర‌ప‌క్షాలుగా కొన‌సాగిన టీడీపీ - బీజేపీలు ఆ త‌ర్వాత వైరివ‌ర్గాలుగా మారిపోయాయి. మిత్రులుగా ఉన్న‌ప్పుడే ఏపీలో టీడీపీ స‌ర్కారు అవినీతి పాల‌న‌ను సాగిస్తోందంటూ బీజేపీ నేత‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వైనం మ‌న‌కు కొత్తేమీ కాదు. అయితే అందుకు ప్ర‌తిగా స్పందించిన టీడీపీ నేత‌లు... మిత్ర‌ప‌క్షం పార్టీ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న స‌రికొత్త నీతి బీజేపీ నేత‌ల‌కే చెల్లింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు త‌ప్పించి... కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు అవినీతి పాల‌న సాగిస్తోంద‌ని ఏనాడూ అన్న పాపాన పోలేదు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ అంటే భ‌య‌మో? లేదంటే... మోదీ స‌ర్కారుపై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తే త‌మ బండారం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డిపోతుంద‌న్న భ‌య‌మో? తెలియ‌దు గానీ... కేంద్ర ప్ర‌భుత్వ అవినీతిపై టీడీపీ నేత‌లు ఇప్ప‌టిదాకా ప్రస్తావించిన పాపాన పోలేద‌ని చెప్పాలి.

అయితే మిత్ర‌ప‌క్షాలు వైరివ‌ర్గాలు మారిన నేప‌థ్యంలో ఇప్పుడు కొత్త‌గా టీడీపీ నేత‌లు బీజేపీ స‌ర్కారుపైనే కాకుండా నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అవినీతిని క‌డిగిపారేస్తానంటూ అధికారంలోకి వచ్చిన న‌రేంద్ర మోదీ అవినీతి పాల‌న‌నే సాగిస్తున్నారంటూ ఇప్పుడు కొత్త ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ తొలిత‌రం నేత‌ - రాజ‌మహేంద్ర‌వ‌రం రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి నేటి ఉద‌యం అమరావ‌తి కేంద్రంగా మీడియా ముందుకు వ‌చ్చి మోదీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ హ‌యాంలో వెలుగు చూసిన బోఫోర్స్ కుంభ‌కోణంతో ఇప్పుడు బీజేపీ స‌ర్కారు కుదుర్చుకున్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుతో ముడిపెట్టిన ఆయ‌న నిజంగానే మోదీ స‌ర్కారుపై పెద్ద ఆరోప‌ణ‌లే చేశార‌ని చెప్పాలి. రాఫెల్ యుద్ద విమానాలలో మోదీ అతి పెద్ద స్కాం చేశారని, గతంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం బోఫోర్స్ కుంభకోణంలో 16 వేల కోట్లు అవినీతికి పాల్పడితే... బీజేపీ ప్ర‌భుత్వం రాఫెల్ డీల్‌లో 30 వేల కోట్ల పైబడి అవినీతికి పాల్పడింద‌ని ఆయన ఆరోపించారు.

ముగ్గురు మోడీలు దేశాన్ని దోచుకుంటున్నారని, బ్యాంకింగ్ వ్యవస్థను సర్వనాశనం చేశారని, బీజేపీ నేతలే పెద్ద దోపిడీ దారులని బుచ్చయ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పెట్రోల్ పేరుతో లక్షల కోట్లు కేంద్రం ఖాజానాకు జమ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం ఇస్తున్నారో చెప్పాలన్నారు. గుజరాత్ అవినీతిపై కాగ్ ఇచ్చిన నివేదికకు ముందు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌కు భ‌య‌ప‌డ్డ బీజేపీ స‌ర్కారు... కావాలనే అన్నాడీఎంకే సభ్యులతో పార్లమెంట్‌ లో ఆందోళన చేయిస్తోందని ఆయన ఆరోపించారు. మొత్తంగా గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మోదీ స‌ర్కారుపై బుచ్చ‌య్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. మ‌రి ఈ ఆరోప‌ణ‌ల‌కు బీజేపీ నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో చూడాలి.