Begin typing your search above and press return to search.

ఇక స‌హించ‌ను..నాలో పాత గోరంట్లను చూస్తారు!

By:  Tupaki Desk   |   9 Sep 2017 7:34 AM GMT
ఇక స‌హించ‌ను..నాలో పాత గోరంట్లను చూస్తారు!
X
టీడీపీ సీనియ‌ర్ నేత‌ - రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం ద్వారా తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణలో బెర్తు ద‌క్క‌క‌పోవ‌డంతో ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెర‌గ‌డం ద్వారా గోరంట్ల క‌ల‌క‌లం సృష్టించిన సంగతి తెలిసిందే. పార్టీ విధానాల‌ను నిర‌సిస్తూ ఒక ద‌శ‌లో రాజీనామా వ‌ర‌కు గోరంట్ల వెళ్లారు. అయితే ఆ త‌ర్వాత చ‌ల్లాబ‌డ్డ గోరంట్ల కొద్దికాలానికి త‌మ పార్టీకి వంత‌పాడ‌టం మొదలుపెట్టారు.

మాజీ ఎంపీలైన ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ - హ‌ర్ష‌కుమార్ ప‌ట్టిసీమ ప్రాజెక్టుపై విమ‌ర్శ‌లు చేస్తే గోరంట్ల గ‌ట్టి ఎదురుదాడి చేశారు. గోదావరి నుండి వృథాగా సముద్రం పాలవుతున్న జలాలనే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకెళ్ళి కృష్ణా డెల్టాను కాపాడుతున్నామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టి పట్టిసీమ పథకం వల్ల గత రెండేళ్ల కాలంలో కృష్ణా డెల్టాలో సుమారు రూ.7500 కోట్ల విలువైన పంటను కాపాడామన్నారు. ఇంత బాగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌బడుతున్న‌ప్ప‌టికీ త‌న‌కు గుర్తింపు ద‌క్క‌డం లేద‌ని తాజాగా గోరంట్ల మండిప‌డ్డారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా జ‌రిగిన ప‌రిణామంపై విలేక‌రుల స‌మావేశంలో గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి విరుచుకుప‌డ్డారు. త‌మ పార్టీ కార్పొరేటర్లకు జరిగిన అవమానంపై స్పందిస్తూ సీఎం వద్దకు తమను కూడా వెళ్లనీయడం లేదని ఇదేం ప‌ద్ద‌త‌ని ప్ర‌శ్నించారు. రూరల్ నియోజకవర్గంలో నగరపాలక సంస్థ అధికారుల పెత్తనం వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థలో కొన్ని తప్పులు జరుగుతున్నాయని, వాటిని సరిదిద్దుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు - ప్రజాభిప్రాయాలకు గౌరవం ఇవ్వకపోతే సహించేది లేదని గోరంట్ల అధికారులను హెచ్చరించారు. ‘నాలో పాత గోరంట్లను చూస్తారు...ఇకపై అధికారుల తప్పులను సహించే ప్రసక్తే లేదు`` అని స్పష్టం చేశారు. అధికారుల నిర్లిప్త వైఖరి వల్ల నగరపాలక సంస్థకు చెందిన ఆశ్రయ అతిధిగృహం అద్దెలు - లీజుల విషయంలో రూ. 11కోట్లు నష్టం జరిగిందన్నారు. ఆనం కళాకేంద్రం నిర్వహణ కూడా సక్రమంగా లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా ఎమ్మెల్యే ఈ స్థాయిలో ఫైర్ అవ‌డం ఎంట‌ని పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.