Begin typing your search above and press return to search.

కోడ్ వేళ సెక్ర‌టేరియ‌ట్ కు సీఎం రావొచ్చా?

By:  Tupaki Desk   |   19 April 2019 5:05 AM GMT
కోడ్ వేళ సెక్ర‌టేరియ‌ట్ కు సీఎం రావొచ్చా?
X
ప్ర‌తి విష‌యం మీదా ఏదో ఒక వివాదం తెర మీద‌కు వ‌స్తోంది. ప్ర‌తిప‌క్షం బ‌లంగా ఉంటే ఇలాంటి ప‌రిస్థితే ఉంటుంది. తెలంగాణ‌లో చూస్తే.. ఏం జ‌రుగుతున్నా క‌నీసం ప్ర‌శ్నించే ప‌రిస్థితి క‌నిపించ‌దు. ఏపీలో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఎన్నిక‌ల ముగిసిన త‌ర్వాత ఫ‌లితాల కోసం వెయిట్ చేస్తున్న వేళ‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేస్తున్న హ‌డావుడి ఇప్పుడు కొత్త సందేహాల‌కు తావిస్తోంది.

ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న వేళ‌.. సీఎం స‌చివాల‌యానికి రావొచ్చా? వ‌స్తే.. ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చు? ఎడాపెడా స‌మీక్ష‌లు చేయ‌టం స‌రైన‌దేనా? లాంటి సందేహాల్ని ఏపీ విప‌క్షం ఈసీకి సంధించింది. దీనిపై ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వివేది రియాక్ట్ అయ్యారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించారు.

ముఖ్య‌మంత్రి స‌మీక్ష‌ల మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు త‌న‌కు అందింద‌ని.. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు సంబంధించిన పుస్త‌కాలు అన్ని రాజ‌కీయ పార్టీల‌కు ఇచ్చామ‌ని.. కోడ్ అమ‌ల్లో ఉండ‌గా రూల్స్ ను అంద‌రూ పాటించాల్సిందేన‌న్నారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్పుడు ముఖ్య‌మంత్రి.. మంత్రులు స‌చివాల‌యానికి రావొచ్చ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే.. స‌చివాల‌యానికి వ‌చ్చిన వారు.. ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌ద‌న్న విష‌యాల‌కు సంబంధించిన వివ‌రాల్ని తామిచ్చిన పుస్త‌కాల్లో వివ‌రంగా పేర్కొన్న‌ట్లు చెప్పారు.

సీఎం స‌చివాల‌యానికి రావొచ్చు.. ఆయ‌న ఛాంబ‌ర్లో కూర్చోవ‌చ్చు.. అయితే..రాజ‌కీయ‌ప‌ర‌మైన ప‌నులు చూడ‌కూడ‌ద‌న్నారు. పోలింగ్ ముందు రోజు (ఏప్రిల్ 10న‌) సీఎం త‌న కార్యాల‌యానికి వ‌చ్చి.. మాట్లాడిన అంశాల్ని ఇంగ్లిషులో ట్రాన్స్ లేట్ చేసి త‌మ‌కు పంపాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం కోరిన‌ట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన నివేదిక‌ను పంపిన‌ట్లు పేర్కొన్నారు. మొత్తానిక కేంద్ర ఎన్నిక‌ల సంఘం బాబు వ్య‌వ‌హారం మీద ఒక క‌న్ను కాదు.. రెండు క‌ళ్లు వేసింద‌న్న‌ట్లుగా ద్వివేది మాట‌లు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.