Begin typing your search above and press return to search.

'జాతిపిత పరువు మనవడి చేతుల్లో!!

By:  Tupaki Desk   |   21 July 2017 9:58 PM IST
జాతిపిత పరువు మనవడి చేతుల్లో!!
X
ఆగస్ట్ 5వ తేదీన జరగబోతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్య నాయుడు విజయం దాదాపుగా ఖరారు అయిపోయినట్లే. రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్ భారీ మెజారిటీతో విజయం సాధించిన తరువాత.. అదే కూటమికి చెందిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక ఫలితం సేమ్ టూ సేమ్ వస్తుందనే అందరూ ఇప్పుడు అంచనా వేస్తున్నారు. అంటే ఈ ఎన్నికలో యూపీఏ/ సోనియా తరఫు అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ ఓడిపోవడం ఖాయం.

మరి గోపాలకృష్ణ గాంధీ అంటే మామూలు వ్యక్తి కాదు. ఈ దేశానికి స్వాతంత్ర్యం రావడానికి సుదీర్ఘకాలం పాటు జరిగిన పోరాటానికి చివరి దశలో నాయకత్వం వహించి, యావత్తు దేశంలో పోరాట స్ఫూర్తిని రగిలించి, ప్రజా ఉద్యమాలకు అహింస అనే ఒక అత్యద్భుతమైన ఆయుధాన్ని అందించి.. ప్రపంచ చరిత్రలోనే తనకంటూ ఓ పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్న భారత జాతిపిత, మహాత్మాగాంధీకి స్వయానా మనుమడు. అదొక్కటే కాదు. స్వాతంత్ర్యం వచ్చిన భారతదేశానికి సొంత రాజ్యాంగం అంటూ తయారు కావడానికి ముందు ప్రథమపౌరుడిగా, ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ గా సేవలందించిన రాజగోపాలాచారికి కూడా మనువడు. అవును... మద్రాసీ అయిన రాజగోపాలాచారి కుమార్తెను, మహాత్మాగాంధీ చిన్న కొడుక్కి ఇచ్చి వివాహం జరిపించారు. వారి పుత్రుడు గోపాలకృష్ణ గాంధీ.

ఈ గోపాలకృష్ణ జనంలో ఉంటూ ఓట్లు వేయించుకునే రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి కాదు. అలాగని సామాన్యుడు కూడా కాదు. మూడో ప్రయత్నంలో సివిల్స్ కు ఎంపికై... ఐఏఎస్ అధికారిగా సేవలందించి విదేశాల్లో భారత హైకమిషనర్ గా చేశారు, గవర్నర్ గా కూడా చేశారు. అంతా బాగానే ఉంది. కానీ, మహాత్ముడి ఇమేజిని పణంగా పెట్టి ఎన్నికల్లో విజయం సాధించాలని, సోనియా వేసిన పాచికకు ఆయన ఇప్పుడు బలి అవుతున్నారు.

అయితే తాజా పరిణామాల్లో మహాత్ముడి భక్తులు అంతా బాధపడుతున్నది ఏంటంటే.. గోపాలకృష్ణ గాంధీ ఓడిపోవడం అంటూ జరిగితే.. మహాత్మాగాంధీ పరువు కూడా పోతుందని! దేశమూ స్వాతంత్ర్యం సంపాదించడమూ తప్ప కుటుంబాన్ని కూడా ఏనాడూ పెద్దగా పట్టించుకుని ఎరగని మహాత్మాగాంధీ కి దేశ ప్రజల్లో ఉన్న గౌరవానికి భంగం కలిగించేలా.. మనవడి ఓటమి తయారవుతుందని అంతా అనుకుంటున్నారు. నిజానికి సోనియా స్కెచ్ కు తాత ఇమేజి బలికాకుండా, గోపాలకృష్ణ పోటీకి ఒప్పుకోకుండా ఉండాల్సిందని పలువురు భావిస్తున్నారు. అయినా ఇప్పుడిక చేసేదేముంది.. ఆలస్యం జరిగిపోయింది.. ఎదురయ్యే ఓటమిని తాత కు క్షమాపణలతో స్వీకరించడం తప్ప ఆయన వేరే చేయగలిగింది కూడా లేదు!!