Begin typing your search above and press return to search.

గూగుల్ మళ్లీ గ్రేట్.. ఆత్మహత్యను ఆపేసింది

By:  Tupaki Desk   |   10 Jan 2017 10:01 AM GMT
గూగుల్ మళ్లీ గ్రేట్.. ఆత్మహత్యను ఆపేసింది
X
గూగుల్ అంటే... ప్రపంచంలో ఏ విషయంపైనైనా మనకు సమచారం అందించే నిధి. దారి తెలియకపోతే తోవ చూపే మార్గదర్శి.. అంతేకాదండోయ్.. ఇప్పుడు ప్రాణదాత అవతారం కూడా ఎత్తింది. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారికి ఆ ఆలోచన నుంచి మళ్లిస్తోంది. తాజాగా ఇండియాలోనే ఓ అమ్మాయి ప్రాణాలు కాపాడింది.

ప్రేమలో విఫలమయ్యామని.. అమ్మానాన్నలు తిట్టారని.. అందంగా లేమని.. అనుకున్నది సాధించలేదని.. ఇలా ప్రతి చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు కుర్రకారు. నిత్యం ఇలాంటి వార్తలు చూస్తున్నాం. ఉత్తర ప్రదేశ్ లోని బరేలీకి చెందిన ఓ 24 ఏళ్ల అమ్మాయి కూడా ఇలాగే ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కుటుంబ ఒత్తిడి కారణంగా ఆమె ప్రేమించిన యువకుడు ఆమెను వదిలేయడంతో యుమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని వెళ్లింది.

అక్కడే పెద్ద మలుపు... అన్నిటికీ టెక్నాలజీని నమ్ముకుంటున్న ఈతరం యువత మాదిరిగానే ఆమెకు కూడా ప్రతి దానికీ గూగుల్ పై ఆధారపడే అలవాటుంది. సో... ఎలా ఆత్మహత్య చేసుకోవాలి.. కష్టం లేకుండా చచ్చిపోవడం ఎలా అని గూగుల్‌ లో సర్చ్ చేసింది. దీంతో గూగుల్‌ లో కొన్ని హెల్ప్‌ లైన్ నెంబర్లు ఆమెకు కనిపించాయి. ఆ ఆమ్మాయి తన ఆత్మహత్యను కాస్త వాయిదా వేసి ఆ నెంబర్‌ కి ఫోన్ చేసింది.

మళ్లీ మరో మలుపు.. గూగుల్ హెల్ప్ లైన్ నంబర్ అని చూపించిన ఆ నంబరు నిజానికి హెల్ప్‌ లైన్ నెంబర్ కాదు.. ఆత్మహత్యలను నివారించే నెంబర్ .. ఆ అమ్మాయి చేసిన ఫోన్‌ ను స్థానిక డిఐజి జితేంద్ర కుమార్ సహానికి వెళ్లింది. అమ్మాయితో మాట్లాడిన ఆయన ఎలాగొలా ఒప్పించి ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా ఆపారు. ఇంకేముంది గూగుల్ పుణ్యమా అని నిండు ప్రాణం నిలబడింది.

డిఐజి జితేంద్ర కుమార్ కు జనవరి 3న ఆ కాల్ వచ్చింది.. ఆ అమ్మాయి చాలా నిరుత్సాహంగా, తన జీవితాన్ని ముగించుకోవాలనే ఆలోచనతో మాట్లాడింది. తను గూగుల్‌లో ఎలా ఆత్మహత్య చేసుకోవాలో కూడా వెదికినట్లు తెలిపింది. జితేంద్ర కుమార్ ఆమెతో చాలా నేర్పుగా మాట్లాడి.. ఆత్మహత్య చేసుకోవద్దని, తన సమస్యకు పరిష్కారం చూపిస్తానని చెప్పి తన ఆఫీస్‌ కు రమ్మని పిలిచారు. జితేంద్ర కుమార్ మాటలతో మెత్తబడిన ఆమె ఆయన కార్యాలయానికి వెళ్లగా... సీనియర్ మహిళ పోలీసులతో ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించారు. జీవితంలో ధైర్యంగా ఉండాలని, ఎటువంటి సమస్యనైనా ఎదురుకోవాలని ఆమెకు ధైర్యం నూరిపోశారు. దీంతో ఆమె ఆత్మహత్య ఆలోచనను విరమించుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/