Begin typing your search above and press return to search.

ఇలాంటివి గూగుల్ ఉద్యోగులే చేయగలరేమో?

By:  Tupaki Desk   |   16 Aug 2019 5:48 AM GMT
ఇలాంటివి గూగుల్ ఉద్యోగులే చేయగలరేమో?
X
అప్పుడెప్పుడో బానిస జీవితాలు ఉండేవని చరిత్ర చెబుతూ ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో అలాంటివి మచ్చుకు లేవని చెప్పినా.. అదంతా ఉత్తదేనని చెప్పాలి. ఉద్యోగి అంటూ అందమైన పేరు పెట్టేసి.. బానిసల మాదిరే పని చేయించుకుంటున్న కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఉన్నాయి. మనసు.. మనోభావాల్ని మడిచి సంచిలో పెట్టేసుకొని.. ఆఫీసుకొచ్చినప్పటి నుంచి వెళ్లే వరకూ వ్యవహరించాలని చెప్పే కంపెనీలకు తగ్గట్లే పని చేసే వారే ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తారు.

తాము చేస్తున్నపని మీద ఏ చిన్న విమర్శ చేసినా.. తమకు ఉపాధినిచ్చిన కంపెనీని పల్లెత్తు మాట అన్నా.. కెరీర్ కాస్తా క్లోజ్ కావటం డిజిటల్ యుగం స్పెషల్ గా చెప్పాలి. మనిషి అంతకంతకూ డెవలప్ అవుతున్నట్లుగా చెబుతున్నా.. అతగాడి హక్కులు అంతకంతకూ కుదించుకుపోతున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి వేళ.. బాస్ చెప్పిన పనిని చేయటంతో పాటు.. తమకు నచ్చని పనిని మొహమాటం లేకుండా ఓపెన్ గా చెప్పేసే ఉద్యోగులుగా గూగుల్ ఎంప్లాయిస్ ను చెప్పాలి. ప్రపంచంలో మరే కంపెనీలో లేని విధంగా.. మేం ఫలానా పనిని చేయమంటే చేయమని ఓపెన్ గా తేల్చి చెప్పేసే తీరు గూగుల్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.

స్వేచ్ఛా వాతావరణంలో పని చేయటం లాంటివి పుస్తకాల్లోనే తప్పించి ప్రాక్టికల్ గా ఉండవన్న దానికి భిన్నంగా గూగుల్ ఉద్యోగులు వ్యవహరిస్తూ తమకున్న స్వేచ్ఛను చెప్పేసే తీరు చూస్తే.. మిగిలిన కంపెనీ ఉద్యోగులకు అసూయ పుట్టించేస్తుంటుంది. తాజాగా తమ తీరును మరోసారి బయటకు వెళ్లగక్కి వార్తల్లోకి వచ్చారు గూగుల్ ఉద్యోగులు. మానవ హక్కులను ఉల్లంఘిస్తూ.. వలసదారుల విషయంలో అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వందలాది గూగుల్ ఉద్యోగులు నిరసన వెళ్లగక్కారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి పని చేయకూడదని దాదాపు అరువందలకు పైగా గూగుల్ ఉద్యోగులు ఒక ఆన్ లైన్ పిటిషన్ మీద సంతకాలు చేసి.. తాము పని చేస్తున్న కంపెనీ అధికారులకు అందించారు.

యూఎస్ కస్టమ్స్.. బోర్డర్ ప్రొటెక్షన్ తో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు సంబంధించి.. ప్రస్తుతం గూగుల్.. అమెజాన్.. మైక్రోసాఫ్ట్ కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తున్న అమెరికన్ అధికారులకు షాకిచ్చేలా వారికి సేవల్ని తాము అందించమంటూ గూగుల్ ఉద్యోగులు తమ కంపెనీకి చెప్పటం సంచలనంగా మారింది. అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం వచ్చిందన్న గూగుల్ ఉద్యోగుల తీరు చూస్తే.. తాము పని చేసే యాజమాన్యం.. ఎవరితో వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలో.. ఎవరితో వద్దన్న విషయాన్ని నేరుగా చెప్పటం చూస్తే.. ఇలాంటివి గూగుల్ ఉద్యోగులకు మాత్రమే సాధ్యమేమో? అన్న భావన కలుగక మానదు.