Begin typing your search above and press return to search.

‘‘ఫేస్ బుక్’’ మాటనే చెప్పిన ‘‘గూగుల్’’

By:  Tupaki Desk   |   13 Dec 2015 8:33 AM GMT
‘‘ఫేస్ బుక్’’ మాటనే చెప్పిన ‘‘గూగుల్’’
X
కొత్త తరం.. సరికొత్త గళాన్ని వినిపిస్తున్న సంగతి గత రెండు వారాల్లో పలుమార్లు స్పష్టమైంది. సినిమాల్లో నటించే వారు సినిమాల సంగతే చూసుకోవటం.. అలాగే వ్యాపారాలు చేసే వారు.. సంస్థ లాభాలు.. వాటి ప్రయోజనాల గురించి మాత్రమే మాట్లాడే ధోరణి ఈ మధ్య తగ్గింది. చెన్నై వరదల్ని చూస్తే.. సినిమా నటులైనప్పటికీ.. వారు స్పందించిన తీరు పలువురిని కదిలించేసింది. ఒక విపత్తు నివారణ శాఖలో పని చేసే అధికారి తరహాలో హీరోలు విశాల్.. సిదార్థ్ వ్యవహరిస్తే.. విప్తతులతో ప్రజలు ఇక్కట్లకు గురి కావటాన్ని చూసి కదిలిపోయి.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా దుమ్మెత్తి పోసిన తీరు కమల్ హాసన్ మాటల్లో కనిపిస్తుంది. తర్వాత ఆయన తన మాటను మార్చుకోవటం.. దాని వెనుకున్న అసలు విషయాలు అందరికి తెలిసిందే.

ఇలా.. వివిధ వర్గాలకు చెందిన అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు తమ పరిధిని దాటి సమాజ హితాన్ని కోరేలా మాట్లాడేందుకు వెనుకాడకపోవటం ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న విపత్తులో తమిళ ఇండస్ట్రీ ఒక రకంగా స్పందిస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయాలని తపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యన వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అమెరికాకు.. ముస్లింలను అనుమతించకూడదని.. అది వారికే మంచిదంటూ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించటంతో పాటు.. పెద్ద చర్చనే రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ లాంటి వారు స్పందించి.. ట్రంప్ వ్యాఖ్యలు సరికావని తేల్చేశారు. వ్యాపార వర్గాల్లోనూ.. ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఒకరైన జుకర్ బర్గ్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న వ్యక్తి మాటల్ని తప్పు పట్టటం కాస్తంత కొత్తనే చెప్పాలి. తన వాదనను వినిపించిన జుకర్ బర్గ్ మాదిరే.. తాజాగా గూగుల్ సీఈవో.. భారత మూలాలున్న సుందర్ పిచ్చై సైతం ట్రంప్ మాటల్ని తప్పు పట్టటం విశేషం. దేశాన్ని కానీ.. సంస్థను కానీ ముందుకు నడిపించాలంటే అందరికి కలుపుకుపోవాలని.. వివిధ వర్గాల సభ్యులకు చోటివ్వాలంటూ వ్యాఖ్యానించారు. అమెరికాతో పాటు.. ప్రపంచ దేశాల్లోని ముస్లింలు.. మైనార్టీలకు మద్దతు వ్వాలని కోరారు.

ఎవరో చేసిన తప్పునకు తమను శిక్షిస్తారన్న భయంతో ముస్లింలు ఉన్నారని.. అలాంటి వారికి పూర్తి భరోసా ఇవ్వాలన్న మాటను ఆయన చెప్పుకొచ్చారు. ఫేస్ బుక్ సీఈవో బాటలనే గూగుల్ సీఈవో తన వాదనను వినిపించటం గమనార్హం. ప్రపంచాన్ని ప్రభావితం చేసే రెండు సంస్థల కీలక వ్యక్తులు ఒకేలా స్పందించం.. అది కూడా సున్నితమైన అంశం మీద కావటం విశేషంగా చెప్పక తప్పదు.