Begin typing your search above and press return to search.

గూగుల్.. స్వీట్ షాపులా అనిపించింది!

By:  Tupaki Desk   |   17 Dec 2015 12:38 PM GMT
గూగుల్.. స్వీట్ షాపులా అనిపించింది!
X
ప్ర‌వాస భార‌తీయుడు సుంద‌ర్ పిచాయ్ పేరు ఇప్పుడు తెలీని వారు చాలా అరుదు. ప్రముఖ సెర్చింజ‌న్ గూగుల్ సీఈవోగా అత్యున్న‌త ప‌ద‌విని చేప‌ట్టిన సుంద‌ర్ పిచాయ్‌.. సీఈవో కుర్చీలో కూర్చున్న త‌ర్వాత తొలిసారి భారత్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావ‌ట‌మే కాదు.. విద్యార్థులు.. ఉపాధ్యాయులు అడిగిన ప‌లు విష‌యాల‌కు జ‌వాబులిచ్చారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ క్రికెట్ కామంటేట‌ర్ హ‌ర్షాబోగ్లే యాంక‌రింగ్ చేశారు. ఈ సంద‌ర్భంగా వృత్తిప‌ర‌మైన అంశాల‌తో పాటు.. వ్య‌క్తిగ‌త సంగ‌తుల్ని చెప్పుకొచ్చారు. మ‌రి ఆయ‌న చెప్పిన సంగ‌తుల్ని చూస్తే..

= విద్యార్థులు రిస్క్ తీసుకోవాలి. దీని వ‌ల్ల ఇబ్బందులే కాదు.. విజ‌యాలు కూడా వ‌స్తాయి. రానున్న జ‌న‌రేష‌న్ కు క్రియేటివిటీనే ప్ర‌ధానాంశం. చ‌దువుల కంటే సృజ‌న చాలా అవ‌స‌రం. ఉద్యోగాలు చేయ‌టం కంటే.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎలా ఎద‌గాల‌న్న దాని గురించి ఆలోచించండి.

= చ‌దువు అయిపోయిన వెంట‌నే ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా ఆలోచ‌న‌లు ఉండాలి. ఎడ్యుకేష‌న్ పూర్తి అయిన వెంట‌నే.. కంపెనీ స్టార్ట్ చేయాల‌న్న త‌ప‌న ఉండాలి.

= భార‌తీయ విద్యావిధానం క్రియేటివిటీని ఎప్పుడూ ప్రోత్స‌హిస్తూనే ఉంటుంది. అందువ‌ల్లే ఇక్క‌డి విద్యార్థులు స‌వాళ్లను స్వీక‌రించి కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌స్తున్నారు.

= విద్యార్థులు రిస్క్ తీసుకోవాలి. ఇప్ప‌టికే ఇండియాలో స్టార్ట‌ప్ క‌ల్చ‌ర్ పెరుగుతోంది. ఇండియా చాలా మారింది. పాఠ‌శాల‌ల్లోనే కోడింగ్ త‌ప్ప‌నిస‌రి చేయాలి.

= ఢిల్లీకి.. సిలికాన్ వ్యాలీకి తేడా లేదు.

= భార‌త్ విద్యార్థుల‌కు సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప్ మెంట్ మీద ఆస‌క్తి ఎక్కువ‌. అలాంటి వారిలో 20 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇచ్చి వారిని ఉత్త‌మ డెవ‌ల‌ప‌ర్లుగా చేయాల‌ని గూగుల్ భావిస్తోంది. ఇప్ప‌టికే ఇక్క‌డ 30 వ‌ర్సిటీల‌తో ఒప్పందం చేసుకున్నాం.

= గూగుల్ సంస్థ‌లో అడుగుపెట్టిన తొలిరోజు మిఠాయి దుకాణంలోకి అడుగుపెట్టిన‌ట్లు ఫీల‌య్యా. గూగుల్ అద్భుతాల కేంద్రం.

= నా మొద‌టి ఫోన్ 1995 - 96లో కొన్నా. నేను అప్ప‌ట్లో కొన్న‌ది మోట‌రోలా. స్మార్ట్ ఫోన్ అయితే 2006లో.

= నేను ఫుట్ బాల్ అభిమానిని. నేను పెరిగిన స‌మ‌యంలో టీ20 లేదు. అందుకే.. దాని మీద పెద్ద ఆస‌క్తి లేదు. నా చిన్నత‌నంలో టెస్ట్‌.. వ‌న్డే క్రికెట్ మ్యాచ్ లు ఉండేవి. వాటిని అస్వాదించినంత బాగా టీ20ని ఎంజాయ్ చేయ‌లేను.

= తొలుత సునీల్ గ‌వాస్క‌ర్ అభిమానిని.. త‌ర్వాత స‌చిన్ టెండూల్క‌ర్ ను అభిమానిస్తా.

= ఒక‌వేళ గూగుల్ సీఈవో కాకుంటే సాఫ్ట్ వేర్ ప్రొడ‌క్ట్స్ ను త‌యారు చేస్తూ ఉండేవాడిని. వాటి గురించే ఆలోచిస్తూ ఉండేవాడినేమో.

= నాకు స్వీట్లు తిన‌టం పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు. సాంబార్ అంటే ఇష్టం.

= పేడ‌.. పాయ‌సం.. లాంటి భార‌తీయ మిఠాయి పేర్లు పెట్టొచ్చ‌ని అడుగుతున్నారు. ఈసారి అండ్రాయిడ్ కొత్త వెర్ష‌న్‌కు పేరు పెట్టే స‌మ‌యంలో ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వ‌హించి.. పేరును ఎంపిక చేసే అంశాన్ని ప‌రిశీలిస్తాం.