Begin typing your search above and press return to search.

సచివాలయాల ఉద్యోగులకు సీఎం బంపర్ ఆఫర్ ..ఏంటంటే?

By:  Tupaki Desk   |   23 Aug 2021 7:38 AM GMT
సచివాలయాల ఉద్యోగులకు సీఎం బంపర్ ఆఫర్ ..ఏంటంటే?
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందు కు వీలుగా నియమించిన సచివాలయాల ఉద్యోగులకు శాశ్వత నియామకాలు చేపట్టే సమయం వచ్చేసింది. ఈ అక్టోబర్ లో రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న వీరికి శాశ్వత నియామకాల కోసం ప్రభుత్వం శాఖాపరమైన పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో ఇప్పటివరకూ సగం మంది అర్హత సాధించారు. మిగిలిన వారికి కూడా వచ్చే నెలలో అర్హత పరీక్షలు నిర్వహించి అందరికీ ఏకంగా అక్టోబర్ లోనే శాశ్వత నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నధం అవుతుంది.

ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయాల్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దాదాపు 15 వేలకు పైగా సచివాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఇందులో ఒక్కో దానిలో 12 మందికి పైగా సిబ్బందిని నియమించింది. దీంతో దాదాపు లక్షా 34 వేల మందికి సచివాలయ కార్యదర్శుల రూపంలో ఉద్యోగాలు లభించాయి. వీరికి రెండేళ్ల ప్రొబేషన్ కాలం పెట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత శాఖాపరమైన పరీక్షలు నిర్వహించి శాశ్వత నియామకాలు ఇస్తామని ప్రకటించింది.

ఈ రెండేళ్లలో వీరికి నెలకు రూ.15 వేల చొప్పన స్టయిఫండ్ చెల్లిస్తున్నారు. ఇప్పుడు వీరంతా శాఖాపరమైన పరీక్షలు పాసైతేనే శాశ్వత నియామకాలు అందుకుంటారు. ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగాల్లో నియమించినప్పుడు చెప్పిన విధంగానే ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగాలు పర్మినెంట్ చేసేందుకు వీలుగా శాఖాపరమైన పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు పాల్గొంటున్నారు. శాఖాపరమైన అంశాలపై వీరు ఎంత పట్టు సాధించారనే అంశాల్ని ఇందులో పరీక్షిస్తున్నారు. వీటిలో ఉద్యోగులు తెచ్చుకునే మార్కుల ఆధారంగానే వీరి ఉద్యోగాలు శాశ్వతం కాబోతున్నాయి.

విఫలమైతే మాత్రం కచ్చితంగా మరోసారి పరీక్ష రాయాల్సిందే. ఇలా ఎన్నిసార్లు విఫలమైతే అన్నిసార్లు పరీక్ష రాసి ఉద్యోగంలో పర్మినెంట్ కావాల్సిందే. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో 50 శాతం మంది పాసైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరంతా అక్టోబర్ లో ఇచ్చే శాశ్వత నియామకాలకు అర్హులు కాబోతున్నారు. ఇప్పటివరకూ రూ.15 వేలు స్ధయిఫండ్ అందుకున్న వీరంతా అక్టోబర్ నుంచి రెగ్యులర్ పేస్కేల్ ప్రకారం కనీసం రూ.35 వేల రూపాయల వేతనం అందుకోబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఆర్ధిక భారం కూడా పెరగబోతోంది.

అయినా సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటుడటం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి ఏపీపీఎస్సీ ద్వారా మరోసారి శాఖాపరమైన పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్లో శాఖాపరమైన పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని కోరినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఫెయిలైన వారికి పదో తరగతి, ఇంటర్ పరీక్షల తరహాలోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి మరో అవకాశం కల్పించబోతున్నారు.

ఏపీలో సచివాలయ ఉద్యోగులుగా గతంలో తాత్కాలిక నియామకాలు పొందిన వారిలో కేవలం సగం మందే అంటే దాదాపు 67 వేల మందే ఉత్తీర్ణులు అయిన నేపథ్యంలో ప్రభుత్వం వీరికి మరో అవకాశం కల్పించబోతోంది. అయితే ప్రభుత్వం కోరుకుంటే ఎప్పుడైనా వీరికి శాఖాపరమైన పరీక్షలు నిర్వహించవచ్చు. కానీ తాజాగా పరీక్షలు ముగిసిన నెల రోజుల్లోనే మరోసారి పరీక్షలు నిర్వహించడం ద్వారా అక్టోబర్ లోపు మిగిలిన వారిని కూడా క్వాలిఫై చేసేందుకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లయింది. ఎందుకంటే ప్రభుత్వం ఇదే పరీక్షలు ఏ జనవరిలోనో నిర్వహిస్తే అప్పటివరకూ వీరంతా తమ సహచరులు శాశ్వత ఉద్యోగాల్లో రెగ్యులర్ జీతాలు తీసుకుంటుంటే పరీక్ష పాస్ కానందున తాత్కాలిక వేతనాలపైనే కొనసాగాల్సి ఉంటుంది.

దీంతో సచివాలయ ఉద్యోగులందరినీ ముందుగా అనుకున్నట్లుగానే అక్టోబర్ లోపు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులు చేయడం ద్వారా ఒకేసారి శాశ్వత నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. ఇప్పటికే శాశ్వత నియామకాలు తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు అయితే రెగ్యులర్ వేతనాలతో పనిచేస్తూ శాఖాపరమైన పరీక్షలతో ప్రమోషన్లు తీసుకుంటారు. కానీ సచివాలయ ఉద్యోగులు మాత్రం అలా కాదు. వారు రూ.15 వేల స్టయిఫండ్ తో పనిచేస్తూనే శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణులు అయ్యే వరకూ రాయాల్సి ఉంటుంది. దీంతో ఈ పరీక్షలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.