Begin typing your search above and press return to search.

దుర్ముఖి లో శుభవార్తలు

By:  Tupaki Desk   |   13 April 2016 7:30 AM GMT
దుర్ముఖి లో శుభవార్తలు
X
తెలుగు నూతన సంవత్సరం దుర్ముఖి ఆదిలోనే అనర్థాలతో జనంలో భయాందోళనలు నింపింది. దీంతో 'దుర్ముఖి' పేరును బట్టి ఈ ఏడాదంతా ఇలాగే ఉంటుందా అని అంతా ఆందోళన చెందారు. ఏడాది ప్రారంభంలోనే కేరళలో భారీ ప్రమాదం జరిగి 109 మంది మృతిచెందడం... ఇతర ప్రమాదాలు - భూకంపాలు - నీళ్ల కొట్టాటలు - ఎన్నికల్లో ప్రమాదాలు - ఘర్షణలు వంటివాటితో జనం జడుసుకున్నారు. కానీ,... తాజాగా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఒక్క రోజులో మూడు శుభవార్తలు వినిపించాయి.

భారత ఆర్థిక వ్యవస్థకు మరింత ఉత్తేజాన్నిస్తూ, ఈ వర్షాకాల సీజనులో సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయని వాతవరణ శాఖ అధికారుల నుంచి వచ్చిన ప్రకటనకు తోడు - ఆరు నెలల కనిష్ఠానికి పడిపోయిన చిల్లర ద్రవ్యోల్బణం - ఇదే సమయంలో పారిశ్రామికోత్పత్తి మూడు నెలల పతనం తరువాత తిరిగి కోలుకుందని వచ్చిన వార్తలు నిజంగా శుభవార్తే. రెండు వరుస సంవత్సరాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. లాతూరు వంటి ప్రాంతాలకు రైళ్లలో నీటిని పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో వర్షాకాలం సంతృప్తికరమని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఆపై కాసేపటికే కేంద్ర గణాంకాల శాఖ నుంచి వెలువడిన ప్రకటన చూస్తే, ఫిబ్రవరిలో భారత పారిశ్రామికోత్పత్తి రెండు శాతం పెరిగింది. ఇక చిల్లర ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం 5.3 శాతం నుంచి 5.21 శాతానికి తగ్గి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచింది.

గ్రామీణ భారతావనిలో ఇన్ ఫ్లేషన్ 6.05 నుంచి 5.7 శాతానికి - పట్టణ ప్రాంతాల్లో 4.3 శాతం నుంచి 3.95 శాతానికి తగ్గిందన్న ప్రకటన వెలువడింది. ఇక ఈ వార్తలతో మంగళవారం నాటి స్టాక్ మార్కెట్ లాభాల్లో నడవగా, ఆ ప్రభావం బుధవారం కూడా కనిపించింది. సెషన్ ఆరంభంలోనే సెన్సెక్స్ సూచిక 400 పాయింట్లకు పైగా పెరిగింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా ఈక్విటీల కొనుగోలు చేస్తుండగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి సెన్సెక్స్ 407 పాయింట్లు పెరిగి 1.62 శాతం లాభంతో 25,553 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. వాతావరణ శాఖ అధికారుల నుంచి గణాంకాల శాఖ వరకూ మంగళవారం చేసిన ప్రకటనలు ఆర్థిక పరంగా దేశానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. అంచనాలు నిజమైతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 శాతానికి మించిన జీడీపీ వృద్ధి నమోదు అవుతుందని తెలిపారు. ద్రవ్య స్థిరీకరణ దిశగా బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ప్రతిపాదనల అమలు, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు కొనసాగితే, దేశానికి మరింత లాభమని అసోచామ్ చెబుతోంది. మొత్తానికి దుర్ముఖి అంత చెడ్డదేమీ కాదని జనం ఇప్పుడు కాస్త సంతోసిస్తున్నారు.