Begin typing your search above and press return to search.

స్కూల్ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్?

By:  Tupaki Desk   |   9 May 2020 7:10 AM GMT
స్కూల్ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్?
X
కరోనా-లాక్ డౌన్ తో విద్యార్థుల చదువులు అటకెక్కాయి. చిన్నపిల్లలు అయితే ఏబీసీడీలు, రైమ్స్ సైతం మర్చిపోయారు. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడడం ఖాయం. మార్చి 22 నుంచి భారత దేశంలో పాఠశాలలన్నింటికి సెలవులు ఇచ్చేశారు. దీంతో పిల్లలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో పిల్లల అల్లరికి తల్లిదండ్రుల తల బొప్పి కడుతోంది. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారో దేవుడా అని తల్లిదండ్రులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా భయంతో పిల్లల భద్రతే ముఖ్యం కాబట్టి వారి అల్లరిని భరిస్తున్నారు. ఇతర వ్యాపకాల వైపు మళ్లిస్తున్నారు. కానీ ఇది ఎల్లకాలం సాధ్యం కాదు.

కరోనా భయం వెంటాడుతుండడంతో సెప్టెంబర్ వరకూ స్కూళ్లు తెరవడం కష్టమేనని కేంద్రం భావించింది. ఇప్పటికే ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసింది. పెద్ద తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాల ద్వారా బోధిస్తున్నారు. దీంతో చదువులను చక్కబెట్టేందుకు కేంద్రం డిసైడ్ అయినట్లు సమాచారం.

తాజాగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ స్కూళ్లు తెరవడం.. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఢిల్లీలో వాహన కాలుష్యానికి విరుగుడుగా హిట్ అయిన ‘సరి -బేసి’ వాహనాల విధానాన్ని స్కూళ్లలో అమలు చేయాలని నిర్ణయించారట.. దీనివల్ల స్కూళ్లను తెరిచి ఒక క్లాస్ లోని 50శాతం విద్యార్థులు ఒకరోజు.. మరో 50శాతం విద్యార్థులు మరో రోజు హాజరయ్యేలా చూడబోతున్నారట.. అంటే విద్యార్థులకు ఇక నుంచి 3 రోజులు మాత్రమే బడి. మిగతా మూడు రోజులు టీవీ చానల్స్ ద్వారా పాఠాలను బోధించాలని నిర్ణయించారు.

విద్యార్థులకు బోధించేందుకు 12 చానెల్స్ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. డిజిటల్ చానెల్స్ ద్వారా మూడు రోజుల పాటు స్కూలు విద్యార్థులు పాఠాలు వినాలి. ఇలా మూడురోజులు బడి.. మూడు రోజులు ఆన్ లైన్ పాఠాలు వినేలా కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ఈ విధానం సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఆన్ లైన్ డిజిటల్ విద్యావ్యవస్థకు పురుడుపోసినట్టే. భవిష్యత్తులో విద్యావ్యవస్థలో సమూల మార్పులు ఖాయం.