Begin typing your search above and press return to search.

వాహనదారులకు శుభవార్త.. ఆ వెహికల్స్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!

By:  Tupaki Desk   |   22 Nov 2021 12:30 AM GMT
వాహనదారులకు శుభవార్త.. ఆ వెహికల్స్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
X
ఇటీవల కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఓ వైపు పెరుగుతున్న కాలుష్యపు కోరలు.. మరోవైపు చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులను ఆకర్షించడానికి వివిధ రకాలు ఆఫర్లు సైతం ప్రకటిస్తున్నారు. ఇకపోతే దేశంలో కాలుష్యం అనగానే గుర్తుకువచ్చేది రాజధాని దిల్లీ. కాలుష్య రక్కసి చేతుల్లో దిల్లీ విలవిల్లాడుతోంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం కొన్ని ఆంక్షలను విధించింది. ఇక ఇంధన వనరులతో నడిచే వాహనాలు పదేళ్లు దాటిన తర్వార రోడ్డు మీదకు రావొద్దని గతంలో ప్రకటించింది. ఒకవేళ అలాచేస్తే ఆ వాహనాలను సీజ్ చేస్తామని వెల్లడించింది. ఫలితంగా వాహనదారులు చాలామంది ఆలోచనలో పడ్డారు. పదేళ్లకే వెహికిల్ ను పక్కన పెట్టాలా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటి వారికి ప్రభుత్వం ఓ తీపి కబురును అందించింది.

దేశ రాజధానిలో ఈవీ విధానం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతున్న కేజ్రీవాల్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. పదేళ్ల పైబడిన డీజిల్ వానాలను ఎలక్ట్రికల్ గా మార్చేందుకు మార్గం సుగమం చేసింది. ప్రభుత్వం విధించిన షరతు అనగా పదేళ్లు పైబడిన వాహనాలు ఈ ఎలక్ట్రిక్ ఇంజిన్ తో రోడ్ల మీదకు రావొచ్చు. ఈ దిశగా దిల్లీ రవాణాశాఖ కసరత్తులు షురూ చేసింది. సంప్రదాయ లోకోమోటివ్ ను ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తో భర్తీ చేయడానికి రవాణా శాఖ కృషి చేస్తుందని రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ ఓ సమావేశంలో గురువారం ప్రకటించారు. దిల్లీ ప్రభుత్వం గతేడాది ప్రకటించిన ఎలక్ట్రికల్ విధానం సబ్సిడీలో భాగంగా ఆర్థికేతర ప్రోత్సహకాలను అందిస్తామని తెలిపారు. రిట్రోఫిట్ చేసిన ఈ వాహనాలను పది ఏళ్లకు మించి ఉపయోగించుకోవచ్చని ప్రకటించారు. దిల్లీలో మరిన్ని ఎలక్ట్రికల్ వాహనాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈవీ విధానాన్ని ప్రారంభించిన మంత్రి... దిల్లీలో అప్పుడు కేవలం 46 ఎలక్ట్రికల్ లైట్ కమర్షియల్ వాహనాలు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. అవి ప్రస్తుతం ఏడు శాతం పెరిగాయని తెలిపారు. అంతేకాకుండా 2024 నాటికి 25 శాతం మేర వృద్ధి చెందేలా చర్యలు చేపడుతామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. సంప్రదాయ వాహనాలను ఎలక్ట్రికల్ వాహనంగా మార్చే సౌకర్యం త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను అతి త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు.

దిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ వెసలుబాటు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. పదేళ్లకే వాహనాలను పక్కనపెట్టేయలేక వాహనదారులు ఇబ్బందులు పడేవారని అన్నారు. ఇకపోతే చాలా రోడ్లలో ఇలాంటి వాహనాలను అనుమతించడం లేదు. దాదాపు 250 రోడ్లలో పదేళ్లు పైబడిన వాహనాలను రానివ్వడం లేదు. కాబట్టి కేజ్రీవాల్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. దిల్లీ వాసులకు ఇది చాలాపెద్ద శుభవార్తే.