Begin typing your search above and press return to search.

భార‌త అమెరిక‌న్ల‌కు గుడ్‌న్యూస్‌!

By:  Tupaki Desk   |   12 Nov 2021 7:42 AM GMT
భార‌త అమెరిక‌న్ల‌కు గుడ్‌న్యూస్‌!
X
అమెరికా పౌరుల‌కే ప్రాధాన్యం ఇవ్వాల‌నే ఉద్దేశంతో గ‌త అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యాలు యుఎస్ వెళ్లే భార‌త ప్ర‌జ‌ల‌తో పాటు వ‌ల‌స‌దారుల‌పై ఎంతో ప్రభావం చూపించాయి. అమెరికా వెళ్లాలంటే ఎన్నో ఆంక్ష‌లు క‌నిపించాయి. కానీ బైడెన్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఈ ఆంక్ష‌లను ఒక్కొక్క‌టిగా ఎత్తివేస్తూ ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తోంది.

తాజాగా హెచ్ 1బీ, ఎల్ 2 వీసాదారుల జీవిత భాగ‌స్వాముల‌కు ఆటోమేటిక్ వ‌ర్క్ ఆథ‌రైజేష‌న్ క‌ల్పిస్తూ బైడెన్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. భార‌తీయుల‌తో పాటు వేలాది మంది వ‌ల‌స‌దారుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించేలా తీసుక‌న్న ఈ నిర్ణ‌యం ఎంతో ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగించేదే.

ఒబామా హ‌యాంలో హెచ్ 1బీ వీసాదారుల భాగస్వాముల‌కు ప‌ని అనుమ‌తులు క‌ల్పిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అప్ప‌టి నుంచి అమెరికా వెళ్లే వ‌ల‌స‌దారుల‌కు ఆర్థికంగా గొప్ప ఊర‌ట ల‌భించింది. అమెరికాలో హెచ్ 1బీ వీసాదారుల జీవిత భాగ‌స్వాములు, 21 ఏళ్లోలోపు వ‌య‌సున్న పిల్ల‌లు ఉద్యోగం చేసుకోవ‌డానికి వీలుగా హెచ్ 4 వీసాలు జారీ చేస్తుంటారు. ఈ హెచ్ 4 వీసాదారుల ఉద్యోగ ఆథ‌రైజేష‌న్ ప‌త్రాల పొడ‌గింపు కోసం త‌ర‌చుగా రెగ్యులేట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంటారు.

కానీ గతంలో యుఎస్ సిటిజ‌న్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసెస్ పాల‌సీ ప్ర‌కారం హెచ్ 4 వీసాదారులు ఉద్యోగాలు పొంద‌కుండా హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ నిషేధం విధించింది. దీంతో వారు రీ ఆథ‌రైజేష‌న్ కోసం ఎదురు చూడాల్సి వ‌స్తోంది. ఈ చ‌ర్య‌తో ఎలాంటి చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేకుండా వీళ్లు అత్య‌ధిక వేత‌నాలు పొందే ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది.

ఉద్యోగాలు చేసుకునే అవ‌కాశం కోల్పోయిన హెచ్ 1బీ వీసాదారులు జీవిత భాగస్వాములు అమెరిక‌న్ ఇమ్మిగ్రేష‌న్ లాయ‌ర్స్ అసోసియేష‌న్ (ఏఐఎల్ఏ)ను ఆశ్ర‌యించారు. దీంతో ఈ వ‌ల‌స దారుల జీవిత భాగ‌స్వాముల త‌ర‌పున ఏఐఎల్ఏ పిటిష‌న్ వేయ‌గా అందుకు తాజాగా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ సానుకూలంగా స్పందించింది. అందుకు అనుగుణంగా బైడెన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇక‌పై హెచ్ 1బీ, ఎల్‌2 వీసాదారుల జీవిత భాగ‌స్వాములు త‌మ ఎంప్లాయ్‌మెంట్ ఆథ‌రైజేష‌న్ పొడిగింపు కోసం ఎదురు చూడ‌కుండా ఆటోమేటిక్‌గా ప‌ని అనుమ‌తులు పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది. దీంతో భార‌తీయుల‌కు ఎంతో మేలు చేకూర‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కూ 90 వేల‌కు పైగా హెచ్ 4 వీసాల‌ను జారీ చేయ‌గా.. అందులో మెజార్టీ సంఖ్య‌లో భార‌తీయ మ‌హిళ‌లే ఉన్నారు. గ‌తంలో ఈ వీసాదారుల జీవిత భాగ‌స్వాముల ఎప్లాయ్‌మెంట్ ఆథ‌రైజేష‌న్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ పూర్తి కావ‌డానికి రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టేది. దీంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయేవాళ్లు. కానీ ఇప్పుడా అవ‌స‌రం లేకుండా స‌మ‌స్య తీరిపోయింది.