Begin typing your search above and press return to search.

ఏపీ ప్రజలకు రిలీఫ్.. రెండు నెలల్లో సీన్ మార్చేస్తారట

By:  Tupaki Desk   |   26 Aug 2020 4:00 PM IST
ఏపీ ప్రజలకు రిలీఫ్.. రెండు నెలల్లో సీన్ మార్చేస్తారట
X
చాలా రాష్ట్రాల్లో లేని రీతిలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించటం.. ఇతర రాష్ట్రాలకు వచ్చే వారిని నియంత్రించి.. ఆచితూచి అన్నట్లుగా అనుమతించటంతో పాటు.. పలు కఠిన నిబంధనల్ని అమలు చేసినా.. ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదు కావటం తెలిసిందే. ఒక రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నా.. రోజుకు దగ్గర దగ్గర పదివేల కేసులు నమోదు అయ్యే రాష్ట్రంగా ఏపీనే చెప్పాలి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రజల్లో అలాంటిదేమీ లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో.. ఏపీని చూస్తే అర్థమవుతుంది.

మొన్నటి వరకు రోజుకు పదివేల.. తొమ్మిది వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదై.. ఆందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఇప్పుడిప్పుడే కేసుల నమోదు తగ్గుముఖం పడుతున్నాయి. డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కేసుల్ని మరింత నియంత్రణతో పాటు.. వైరస్ వ్యాప్తి ఏ మేరకు విస్తరించిందో తెలుసుకునేందుకు ఏపీ సర్కారు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

చుట్టుపక్కల రాష్ట్రాలతో పోలిస్తే.. పెద్ద ఎత్తున టెస్టుల్ని నిర్వహిస్తున్న ఏపీ.. అదే తీరును ప్రదర్శించాలని భావిస్తోంది. ఇప్పటికే ఎక్కువ టెస్టులు చేస్తున్న అధికారులు.. ఈ విషయంలో రాజీ పడకూడదని.. అవసరమైతే మరిన్ని పరీక్షలు జరిపేందుకు వెనుకాడకూడదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకోవటం ద్వారా.. రానున్న రెండు నెలల్లో కేసుల నమోదును తగ్గించే అవకాశం ఉందంటున్నారు. అదే నిజమైతే.. ఏపీ ప్రజలకు భారీ రిలీఫ్ అని చెప్పక తప్పదు.