Begin typing your search above and press return to search.

విదేశీ ఉద్యోగాలకిక బై.. బై..

By:  Tupaki Desk   |   2 Sept 2020 6:00 AM IST
విదేశీ ఉద్యోగాలకిక  బై.. బై..
X
కరోనా వచ్చాక.. ఈ రంగం.. ఆ రంగం అనే తేడా లేదు. అన్నింటా తీవ్ర సంక్షోభం నెలకొంది. ప్రపంచంలో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. వృద్ధిరేటు దారుణంగా నమోదవుతోంది. ఖర్చు భరించలేని కంపెనీలు ఉద్యోగులను తొలగించి ఇంటికి పంపించేస్తున్నాయి. దేశంలో ఈ పరిస్థితి ఉంటే దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మొన్నటి వరకు లక్షలు లక్షలు శాలరీ అందుకున్న ఉద్యోగులు.. నేడు విదేశాలు వదిలి స్వదేశం బాటపడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారంటే మొన్నటివరకు ఓ ప్రాధాన్యం ఉండేది. వరుసబెట్టి ఎన్నారైల ఉద్యోగాలు పోతుండడంతో ఇప్పుడా పరిస్థితి లేదు. ఎన్నారైలు కూడా ఇక విదేశాల్లో ఉంటే బతుకు లేదని, ఉద్యోగ భద్రత లేదని స్వదేశాలకు క్యూకడుతున్నారు. ఇక్కడే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికి ప్రోత్సాహం అందిస్తోంది. ఆత్మ నిర్భర భారత్ పేరుతో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. అందుకే చాలా మంది ఎన్నారైలు ఇండియాకు వచ్చి స్టార్టప్ కంపెనీలు ప్రారంభించాలని అనుకుంటున్నారు.

అమెరికాలోని రాజకీయ పరిస్థితులు కూడా ఎన్నారైలను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే వీసాల విషయంలో, ఇతర దేశీయుల ఉద్యోగాల్లో కోత పెట్టిన ట్రంప్ మరోసారి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని ఎన్నారైలు కంగారు పడుతున్నారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ట్రంప్ మరిన్ని కొత్త చట్టాలు తెచ్చే అవకాశం ఉంది. దీనికంటే స్వదేశంలో పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసుకోవడమే మేలని భావిస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ఇండియన్లను వరుస బెట్టి ఇంటికి పంపిస్తున్నారు. ఇలా వచ్చిన ఎన్నారైలు మళ్ళీ తిరిగి అక్కడే అవకాశాలు వెతుక్కోడం కంటే ఇక్కడే పెట్టుబడులు పెట్టేది మేలని భావిస్తున్నారు.