Begin typing your search above and press return to search.

అమిత్ షా ర్యాలీలో గోలీమార్ స్లోగన్స్..కోల్ కతాలో కలకలం

By:  Tupaki Desk   |   1 March 2020 10:30 PM IST
అమిత్ షా ర్యాలీలో గోలీమార్ స్లోగన్స్..కోల్ కతాలో కలకలం
X
దేశ రాజధాని ఢిల్లీలో రోజుల తరబడి సాగుతున్న హింసకు బీజేపీ నేతల నోట నుంచి వినిపించిన గోలీమార్ నినాదాలే కారణమన్న వాదనలు కలకలం రేపుతున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దారికి తీసుకురావడం అంత ఈజీ పనేమీ కాదు కదా. అయితే సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్బంగానే ఢిల్లీలో చిచ్చు రేగగా... ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు చల్లబడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఆదివారం జరిగిన ఓ భారీ ర్యాలీలో కూడా గోలామార్ నినాదాలు వినిపించి కలకలం రేపుతున్నాయి. ఈ నినాదాలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షి నిర్వహించిన ర్యాలీలోనే వినిపించడం గమనార్హం.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కోల్‌కత్తాలో పర్యటించిన విషయం తెలిసిందే. అమిత్‌ షా రాక సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు గోలీమారో నినాదాలు చేయడం గమనార్హం. బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో తొలుత కార్యకర్తలు భారత్ మాతాకీ జై, జై శ్రీరాం నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అయితే అమిత్‌షా పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ప్రతిపక్షాలకు చెందిన ప్రాంతాల్లోకి రాగానే బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ‘గోలీమారో... గోలీమారో’ నినాదాలను చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందించారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, ఆ నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు గోలీమారో నినాదాలు చేయడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. హింసను ప్రేరేపించే విధంగా బీజేపీ నేతలు... కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు గోలీమారో నినాదాలు చేసినా సరే, పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడుతున్నాయి. గోలీమారో నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని బెంగాల్‌ సీపీఎం శాఖ డిమాండ్ చేసింది.