Begin typing your search above and press return to search.

బంగారం.. వెండికి ఈ దూకుడేంది?

By:  Tupaki Desk   |   6 Aug 2020 3:30 AM GMT
బంగారం.. వెండికి ఈ దూకుడేంది?
X
కరోనా వేళ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్ని తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇలాంటివేళ.. బంగారం.. వెండి ధరలు అంతకంతకూ పెరుగుతూ కొత్త రికార్డుల దిశగా పరుగులు తీస్తున్నాయి. తాజాగా బంగారం తన జీవన కాల గరిష్ఠ మొత్తానికి చేరుకోవటం గమనార్హం. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.58వేలకు చేరుకోవటం గమనార్హం. ఒక్కరోజులోనే రూ.1010 పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం రూ.53,010కు ఎగబాకింది.

వెండి ధర సైతం కేజీ రూ.70వేల మైలురాయిని దాటేసింది. ఒక్కరోజులోనే రూ.6450 పెరిగి కేజీ వెండి రూ.71,500లకు చేరుకోవటం విశేషం. ఎందుకీ దూకుడు? ఎక్కడదాకా ఈ పయనం? అన్న ప్రశ్నలు వేసుకుంటే.. ఇంత భారీగా ధరలు పెరగటానికి కారణం.. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలేనని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారి బంగారం ఔన్స్ (31.10గ్రాములు) 2వేల అమెరికన్ డాలర్లను టచ్ చేసింది. అదే సమయంలో వెండి పరిస్థితి కూడా కొత్త రికార్డుల దిశగా పరుగులు తీస్తోంది.

కరోనా వేళ ప్రపంచ ఆర్థిక వృద్ధి మీద నెలకొన్న సందేహాలు..అనిశ్చితితో పాటు అమెరికన్ డాలర్ బలహీనం కావటంతో విలువైన ఈ ఆభరణాలే సేప్ అన్న భావన ఎక్కువ అవుతోంది. అగ్రరాజ్యాలు ప్రకటిస్తున్న భారీ ఉద్దీపన ప్యాకేజీలు కూడా బులియన్ మార్కెట్ల ర్యాలీకి కారణంగా మారుతుున్నాయి. రానున్న 18 నెలల వ్యవధిలో ఔన్స్ బంగారం 3వేల డాలర్ల మార్కును దాటొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. సామాన్య... మధ్యతరగతి వారికి బంగారం అన్నది మరింత ప్రియంగా మారటం ఖాయం.