Begin typing your search above and press return to search.

వామ్మో.. శానిటరీ ప్యాడ్స్ లో గోల్డ్ స్మగ్లింగ్!

By:  Tupaki Desk   |   10 Nov 2021 11:30 PM GMT
వామ్మో.. శానిటరీ ప్యాడ్స్ లో గోల్డ్ స్మగ్లింగ్!
X
బంగారం అక్రమ రవాణా కేసులు తరుచూ చూస్తూనే ఉంటాం. చెప్పులు, ఫేస్ క్రీములు, ఛార్జింగ్ లైట్లు, పిల్లల బొమ్మలు వంటి వస్తువుల్లో బంగారం దాచి స్మగ్లింగ్ చేస్తుండగా చాలామంది అధికారులకు అడ్డంగా దొరికారు. అయితే తాజాగా ఓ మహిళ మాత్రం గోల్డ్ స్మగ్లింగ్ కోసం ఏకంగా శానిటరీ ప్యాడ్స్ ను ఉపయోగించింది. ప్యాడ్స్ లో బంగారం దాచి... వాటిని లోదుస్తుల్లో ఉంచింది. ఈ విధంగా బంగారం అక్రమ రవాణా చేస్తుండగా అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. ఆమె వద్ద ఉన్న 2.4 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. కేరళ కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.

కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ద్వారా విదేశాల నుంచి తీసుకొచ్చిన బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో వచ్చే ప్రయాణికుల ద్వారా గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతోందని పక్కా సమాచారం అందిందని... డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్, ఎయిర్ కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఓ మహిళ అనుమానస్పదంగా తారసపడిందని అధికారులు పేర్కొన్నారు. పైగా ఆమె ఎయిర్ ఇండియాలో పనిచేసే సిబ్బంది కావడం గమనార్హం. మలప్పురానికి చెందిన ఆ మహిళ శానిటరీ న్యాప్ కిన్స్ లో బంగారం ఉంచి స్మగ్లింగ్ చేయడానికి యత్నించిందని అధికారులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న 2.4 కేజీల బంగారం సీజ్ చేసినట్లు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి... బంగారానికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

ఎయిర్ ఇండియాలో పనిచేసే షహానా అనే మహిళ శానిటరీ ప్యాడ్స్ లో బంగారం ఉంచి స్మగ్లింగ్ చేసేందుకు యత్నించిందని అధికారులు పేర్కొన్నారు. వాటిని తన లోదుస్తుల్లో ఉంచిందని తెలిపారు. అయితే తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఆమెను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. పైగా శానిటరీ న్యాప్ కిన్ లో బంగారం ఉండడం చూసి షాకయ్యామని వారు తెలిపారు. అయితే ఈ 2.4 కేజీల బంగారంపై పూర్తి సమాచారం సేకరిస్తామని వెల్లడించారు. విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎంతటి వారినైనా ఉపక్షించబోమని స్పష్టం చేశారు.

బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులకు అడ్డంగా దొరికిన ఘటనలు చాలానే చూస్తుంటాం. అయితే అధికారుల కళ్లుగప్పి అక్రమ రవాణా చేసే క్రమంలో ఇలా దొరికిపోతూనే ఉంటారు. అయినా కూడా యథేచ్ఛగా ఈ అక్రమ రవాణా జరుగుతోందని నిపుణులు అంటున్నారు. స్మగ్లర్లు ఎన్ని రకాలుగా బంగారాన్ని దాచాలని చూసినా అధికారులు గుర్తిస్తూనే ఉన్నారని తెలిపారు. తాజాగా శానిటరీ న్యాప్ కిన్ లో ఉన్న బంగారాన్ని సైతం వెలికితీశారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఫేస్ క్రీములు, ఆహారపదార్థాలే కాకుండా శానిటరీ ప్యాడ్స్ ను కూడా స్మగ్లింగ్ కు ఉపయోగించడం, పైగా ఓ మహిళ ఇలా బంగారం అక్రమ రవాణాకు ప్యాడ్స్ వాడడంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శానిటరీ ప్యాడ్స్ లో గోల్డ్ స్మగ్లింగ్ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.