Begin typing your search above and press return to search.

రూ.23వేలకు టచ్ అవుతుందా?

By:  Tupaki Desk   |   27 July 2015 10:16 AM GMT
రూ.23వేలకు టచ్ అవుతుందా?
X
పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.23 వేలకు వస్తుందా? కలలో కూడా భారతీయులు ఊహించని ఈ ధర మీద ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. ఐదేళ్ల కనిష్ఠానికి దిగిన బంగారం ధర ప్రస్తుతం.. పది గ్రాముల ధర రూ.25వేలకు కాస్తంత దిగువలో ఉంది.

అటు వ్యాపార వర్గాలు.. ఇటు మార్కెట్ నిపుణుల గురి పది గ్రాములు రూ.23వేల మీద ఉంది. మరో నెల రోజుల్లో లోపే ఈ మేజిక్ అంకెకు బంగారం ధర పడిపోతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. ఇదంతా సాధ్యమేనా? అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులతో పసిడి ధర తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బంగారం ధర తగ్గుతుందని మార్కెట్ విశ్లేషకులు బలంగా నమ్ముతుంటే.. వ్యాపార వర్గాలు మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. పది గ్రాముల బంగారం రూ.23వేలకు పడిపోవటం సాధ్యం కాకపోవచ్చనే మాట వినిపిస్తోంది.

దానికి వారు చూపిస్తున్న కారణాలు హేతుబద్ధంగా ఉన్నాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు కారణంగా డాలర్ మరింత బలపడుతుందని.. అదే జరిగితే బంగారం కొనుగోళ్లు తగ్గుతాయన్నది మార్కెట్ విశ్లేషకులు విశ్లేషణ. అయితే.. ఇదే పరిణామం బంగారం ధర పడిపోకుండా చేస్తుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

అదెలా అంటే.. డాలర్ పెరిగితే.. రూపాయి బలహీనం కావటం ఖాయం. అదే జరిగితే.. మారకంలో ఉన్న తేడా కారణంగా.. బంగార ధర తగ్గినప్పటికీ.. భారత్ లో మాత్రం బంగారం ధర తగ్గే ఛాన్స్ లేదని చెబుతున్నారు. అంతకు మించి అనూహ్య పరిణామాలు ఏర్పడితే చెప్పలేమంటున్నారు. కానీ.. అందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

మహా అయితే.. 24 గ్రాముల స్వచ్ఛతతో బంగారం ధర రూ.24వేలకు టచ్ అయితే అదే గొప్పగా వారు చెబుతున్నారు. ఒకవేళ బంగారం ధర తగ్గినా.. ఆ సమయం చాలా స్వల్పంగా ఉంటుందని.. సగటు వినియోగదారుడిలో ఉన్న ఆశ కారణంగా బంగారం ధర తగ్గినప్పుడు.. మరింత తగ్గే వీలుందని భావిస్తారని.. ఆ ఆశే కొనకుండా చేస్తుందని.. బంగారం ధర పెరిగేటప్పుడు ఎంత వేగంగా పెరుగుతుందో.. తగ్గినప్పుడు అంతే వేగంగా రికవరీ అవుతుందన్న విషయాన్ని చాలా మంది మరుస్తారని.. అందుకే.. తగ్గినప్పుడు వెనువెంటనే కొనేయాలని చెబుతున్నారు.

ఈ వారంతంలో లోపు బంగారం ధరకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని..ఈ వారాంతం బంగారం ధర ఆధారంగా ధర తగ్గేది.. లేనిది చెప్పేయొచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా.. తగ్గిన బంగారం ధర మహా అయితే.. ఆగస్టు వరకు మాత్రమే ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. అందుకే.. రూ.23వేల కోసం ఆశగా ఎదురుచూసే కన్నా.. కొనాలనుకున్న బంగారంలో సగం.. ఇప్పటికిప్పుడు.. మిగిలిన సగం ధర భారీగా తగ్గిన వెంటనే కొనేస్తే.. లాభనష్టం సరిసమానంగా ఉంటుందన్న నిపుణులు సూచిస్తున్నారు. సో.. బంగారం కొనటం.. కొనకపోవటం ఇక మీ వంతే.