Begin typing your search above and press return to search.

18 ఏళ్లకే స్వర్ణ పతకం... ఔరా అనిపించిన ఆయూబ్

By:  Tupaki Desk   |   26 July 2021 2:43 AM GMT
18 ఏళ్లకే స్వర్ణ పతకం... ఔరా అనిపించిన ఆయూబ్
X
ఏ అథ్లెట్ అయినా సరే ఒలంపిక్స్ లో స్వర్ణం సాధించాలని కలలు కంటూ ఉంటాడు. స్వర్ణం సాధిస్తే అతని ఆనందాన్ని మాటల్లో వర్ణించడానికి వీలుండదు. కొన్ని సార్లు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వారు కూడా అత్యుత్తమ ప్రదర్శన చేసి విజేతలుగా నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని సార్లు తప్పకుండా గెలుస్తాడని అటు అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులు కూడా అంచనా వేసినా కానీ విఫలమయిన వారు కూడా ఉంటారు. అలాంటి సంఘటనే ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ లో జరిగింది. తునీషియాకు చెందిన 18 ఏళ్ల స్విమ్మర్ అహ్మద్ ఆయూబ్ హఫ్నాయ్ ఒలంపిక్స్ లో స్వర్ణం నెగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఆయూబ్ దెబ్బతో ఖచ్చితంగా స్వర్ణం నెగ్గుతాడని అందరూ భావించిన ఆస్ర్టేలియా స్విమ్మర్ జాక్ కు నిరాశే ఎదురైంది. ఆయూబ్ దెబ్బకు అతడు కేవలం రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఆయూబ్ ఏమైనా అంతలా పేరున్న ఫేవరెట్ క్రీడాకారుడా ? అని అంటే అదేం లేదు. 2019లో విడుదల చేసిన ర్యాకింగ్స్ లో ఆయూబ్ కు వందో స్థానం దక్కడం గమనార్హం. కానీ తాను మాత్రం నంబర్లను నమ్మలేదు. తనపై తాను నమ్మక ముంచాడు. అందరూ ముక్కున వేలేసుకునేలా చేస్తూ... స్వర్ణం గెలిచి ఔరా అనిపించాడు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో తమ దేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశాడు.

ఇది వరకే జరిగిన యూత్ ఒలంపిక్స్ లో పాల్గొన్న ఆయూబ్ ఎనిమిదో స్థానంతో సరి పెట్టుకున్నాడు. ఆయూబ్ విశ్వ క్రీడల్లో మొదటి సారిగా పాల్గొంటున్నా.. అతడిలో ఆ బెరుకు ఏమాత్రం కనిపించలేదు. అతడు ఎలాగైనా సరే మెడల్ సాధించాలన్న కసితో ఈదాడు. అతడి కసికి తలవంచిన ప్రత్యర్థులు వెనుకబడి పోయారు. దీంతో స్వర్ణం ఆయూబ్ సొంతమైంది. తొలిసారిగా ఒలంపిక్స్ లో పాల్గొన్న ఆయూబ్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ... తన అంతర్జాతీయ కెరీర్ ను బంగారు పతకంతో మొదలు పెట్టడం విశేషం.

ఆయూబ్ టోక్యో ఒలంపిక్స్ లో క్వాలిఫయింగ్ రౌండ్ లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడి మీద ఎవరికీ పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. కానీ ఫైనల్ లో మాత్రం అతడి వేగానికి ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అయింది. 400 మీటర్ల కొలనులో ఆయూబ్ చిరుతలా దూసుకుపోయాడు. కేవలం 3:43.36 లలో లక్ష్యాన్ని చేరుకుని బంగారు పతకాన్ని సగర్వంగా ఒడిసి పట్టాడు.

ఖచ్చితంగా బంగారు పతకం గెలుస్తాడని అందరూ భావించిన ఆస్ర్టేలియన్ స్విమ్మర్ జాక్ తొలి రెండు వందల మీటర్ల వరకు ఆదిపత్యం కనబర్చినా చివర్లో ఆయూబ్ వేగానికి తల వంచక తప్పలేదు. దీంతో జాక్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ.. ఆయూబ్ స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయాడు. ఇక స్వర్ణం గెలిచిన తర్వాత అతడు మాట్లాడుతూ.... ఈ విజయాన్ని తాను కూడా నమ్మలేకపోతున్నానని చెప్పడం గమనార్హం. ఆయూబ్ తండ్రి తునీషియా దేశ బాస్కెట్ బాల్ టీంలో సభ్యుడవడం విశేషం.