Begin typing your search above and press return to search.

గన్నవరంలో దొరికిన 'కేజీ' బంగారం ఇష్యూలో అంత తప్పు జరిగిందా?

By:  Tupaki Desk   |   11 Sep 2022 4:31 AM GMT
గన్నవరంలో దొరికిన కేజీ బంగారం ఇష్యూలో అంత తప్పు జరిగిందా?
X
ప్రత్యర్థుల్ని రాజకీయ నేతలు టార్గెట్ చేస్తున్న తీరు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. తమకు నచ్చకుంటే చాలు.. చిన్న ఇష్యూలో దొరికినా రచ్చ రచ్చ చేసే తీరు ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తాజాగా సంచలనంగా మారిన ‘గోల్డ్’నీరజారాణి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలోని కీలకమైన పదవి నుంచి రిటైర్ అయ్యాక.. ఏపీ సచివాలయంలో పెద్ద పదవిని సొంతం చేసుకున్న పెద్ద మనిషి భార్య నీరజా రాణి. ఆమె తరచూ దుబాయ్ వెళ్లి వస్తుంటారు. తాజాగా ఆమె అక్రమ పద్దతిలో దుబాయ్ నుంచి కేజీ బంగారం (సరిగ్గా చెప్పాలంటే 970 గ్రాములు) తీసుకొస్తున్నారన్న సమాచారం అందింది.

దీంతో.. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా అధికారుల టీం గన్నవరం రావటం.. ఆమెను ప్రత్యేకంగా తనిఖీలు చేయగా భారీగా బంగారం లభించింది. నిజంగా అది చాలా పెద్ద తప్పా? అంటే అవునని చెప్పే కన్నా కాదనే చెప్పాలి. ఎందుకంటే.. విదేశాల్లో పన్ను పోటు తక్కువగా ఉండటం.. దేశంలో అత్యధికంగా ఉండటంతో ఆ ధరలో ఉండే తేడా నేపథ్యంలో బంగారాన్ని అక్రమ పద్దతిలో తీసుకొస్తుంటారు. ఒక లెక్క ప్రకారం వంద గ్రాముల బంగారానికి దుబాయ్ కు హైదరాబాద్కు మధ్య ధరలో తేడా ఏకంగా రూ.50వేల వరకు ఉంటుందని చెబుతారు.

దుబాయ్ నుంచి వచ్చే వారు నిబంధనలకు అనుగుణంగా పరిమిత మోతాదులో మాత్రమే బంగారాన్ని తెచ్చుకునే వీలుంది. అయితే.. వ్యాపార కోణంలో చూసినట్లైయితే.. కేజీ బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా బయటకు తీసుకురాగిలితే వచ్చే లాభం ఏకంగా రూ.5లక్షలు. ఒకవేళ అధికారులు పట్టుకుంటే.. దానికి 30 శాతం వరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అంటే.. అలా పన్ను కట్టిన వేళలో.. ఆ సందర్భంగా లాభం మాత్రమే ఉండదు. మహా అయితే ఖర్చుల నష్టం తప్పించి మరేమీ ఉండదు.

నిబంధనల ప్రకారం చట్ట విరుద్ధంగా బంగారాన్ని తెచ్చే వారిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం అధికారులకు ఉండదు. వారి నుంచి ఫైన్ కట్టిస్తే సరి. తాజాగా ఏపీ ఇష్యూలోకి వస్తే నీరజాదేవి ఎపిసోడ్ లోనూ అదే జరిగింది. అక్రమంగా బంగారాన్ని తెస్తున్న ఆమెను తనిఖీల్లో గుర్తించటం.. నిబంధనల్లో ఉన్న దాని ప్రకారం ఫైన్ కట్టించారు. అయితే.. దీనికి మీడియాలో వచ్చిన కథనాలు.. ఆ సందర్భంగా కలిపిన మసాలా చూసినప్పుడు మాత్రం ఒకింత విస్మయానికి గురి కాక తప్పదు. నీరజారాణిని పొద్దుపోయిన తర్వాత ఆమె చేత కస్టమ్స్ డ్యూటీ కట్టించుకొని ఇంటికి పంపించిన వైనాన్ని భూతద్దంలో చూపిస్తూ గుండెలు బాదుకోవటం.. అవసరానికి మించిన రియాక్షనే అవుతుందే తప్పించి మరొకటి కాదన్న మాట వినిపిస్తోంది.

అయితే.. ఈ ఎపిసోడ్ మొత్తంలో అధికారుల వైపు నుంచి తప్పు ఏమైనా జరిగిందంటే.. అది ఎప్పటిలా ప్రెస్ నోట్ ను వివరంగా విడుదల చేయకపోవటం.. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన అంశాన్ని గుట్టుగా ఉంచాలని ప్రయత్నించటం.. నీరజారాణి పేరు లేకుండా ప్రెస్ నోట్ ను క్లుప్తంగా ఉంచుతూ విడుదల చేయటం లాంటివి తప్పుల కిందకే వస్తాయి. అసలే ఈ ఇష్యూ రాజకీయం అయిన నేపథ్యంలో విమర్శలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అధికారులు మరోసారి తప్పు చేసిన మాట పలువురి అభిప్రాయంగా మారింది.