Begin typing your search above and press return to search.

గోకుల్ చాట్ నిందితుల‌కు శిక్ష ఖ‌రారైంది

By:  Tupaki Desk   |   10 Sept 2018 7:18 PM IST
గోకుల్ చాట్ నిందితుల‌కు శిక్ష ఖ‌రారైంది
X
సుదీర్ఘ‌కాలంగా నిరీక్ష‌ణ‌లో ఉన్న తీర్పు వెలువ‌డింది. గోకుల్‌ చాట్ - లుంబినీ పార్కు పేలుళ్ల కేసులో ఎన్ ఐఏ కోర్టు తుదితీర్పును వెలువరించింది. ఈ కేసుల్లో దోషులిద్దరు అనీఖ్ షరీఫ్ - అక్బర్ ఇస్మాయిల్‌ కు ఎన్ ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తారిఖ్ అంజూమ్ కు కోర్టు జీవితఖైదు విధించింది. కోర్టు ఈ నెల 4న అనీఖ్ - ఇస్మాయిల్‌ ను దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. 2007 - ఆగస్టు 25న సాయంత్రం సమయంలో గోకుల్ చాట్ - లుంబిని పార్క్ వద్ద ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 42 మంది మృతి చెందిన విషయం విదితమే. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఆగస్టు 25 - 2007న రాత్రి సమయంలో ఈ జంట పేలుళ్లు జరిగాయి. మొదట లుంబినీ పార్క్‌ లో రాత్రి 7.45 నిమిషాల సమయంలో లేజర్ షో జరుగుతుండగా బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే క్షణాల్లోనే కోఠిలోని గోకుల్‌ చాట్‌ లో పేలుళ్లు జరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొంది. ఈ జంట పేలుళ్లలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అనీఖ్ లుంబినీ పార్కు వద్ద బాంబు అమర్చి 12 మందిని బలిగొన్నాడు. దిల్‌ సుఖ్‌ నగర్‌ లో ఇస్మాయిల్ మారణహోమానికి కుట్ర పన్నాడు. ఈ కేసులో కోర్టు ఇప్పటికే సాదిక్ - ఫారుఖ్‌ లను నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌ లో ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ పేలుడుకు పాల్పడ్డ మొదటి సంఘట ఇదే. ఈ జంట పేలుళ్లతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ రెండు కేసులను మొదట సిట్ అధికారులు కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటైన అక్టోపస్ ఈ కేసు విచారణను నిర్వహించింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కోర్టు విచారణను మొత్తం కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు చేపట్టి పూర్తి ఆధారాలు, నిందితుల పాత్రల నిర్ధారణకు సంబంధించిన అంశాలను కోర్టు విచారణలో పొందుపర్చారు. ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుల్లో ఒకరైనా రియాజ్‌భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమీరజాఖాన్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరీ, అనీక్ షఫీక్ సయ్యిద్, ఫారూక్ షర్ఫూద్దీన్ తర్కాష్ - మహ్మద్ సాధిక్ ఇస్రార్ అహ్మద్ - తారీఖ్ అంజూమ్‌ లు ఈ కుట్రకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అక్బర్ ఇస్మాయిల్ చౌదరీ - అనీక్ షఫీక్ సయ్యిద్ - ఫారూక్ షర్ఫూద్దీన్ తర్కాష్ - మహ్మద్ సాధిక్ ఇస్రార్ అహ్మద్ - తారీఖ్ అంజూమ్‌ లు అరెస్టు కాగా రియాజ్‌ భత్కల్ - ఇక్బాల్ భత్కల్ - అమీరజాఖాన్‌ లు పరారీలో ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ రియా జ్ భత్కల్ పాకిస్థాన్ - దుబాయ్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు నిఘా - పలు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం అరస్టైన ఐదుగురు ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులు చర్లపల్లి జైలులో ఉన్నారు.