Begin typing your search above and press return to search.

ఏపీలో తగ్గిన రద్దీ.. తెలంగాణలో అదే ఉత్సాహం

By:  Tupaki Desk   |   22 July 2015 10:29 AM IST
ఏపీలో తగ్గిన రద్దీ.. తెలంగాణలో అదే ఉత్సాహం
X
గోదావరి మహా పుష్కరాలు మొదలై ఎనిమిదిరోజులైంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి వచ్చిన ఈ పుష్కరాలకు.. రెండు రాష్ట్రాల్లోనూ భక్తులు భారీగా పుష్కర స్నాన్నాన్ని ఆచరిస్తున్నారు. పుష్కరాలు మొదలైన తర్వాత శుక్రవారంతో భారీ స్థాయిలోకి వెళ్లిన రద్దీ.. శనివారం నాటికి పీక్ స్టేజ్ కి చేరిన సంగతి తెలిసిందే. ఆ రద్దీ ఆదివారం కంటిన్యూ అయితే.. సోమవారం కాస్త అటూఇటూగా రద్దీ కొనసాగింది.

మంగళవారం నాటికి పుష్కర రద్దీ కాస్త సద్దుమణిగింది. శని..ఆదివారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కోటి మందికి టచ్ అయిన పుష్కర స్నానాలు.. సోమవారం కోటికి కాస్త అటూఇటూగా అయ్యారు. పుష్కరాలు ప్రారంభం అయిన నాటి నుంచి పుష్కర హడావుడి తెలంగాణలోని ఐదు జిల్లాలతో పోలిస్తే.. ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లోనే భక్తుల రద్దీ ఎక్కువగా నమోదైంది.

మంగళవారం అందుకు భిన్నమైన దృశ్యం కనిపించింది. తెలంగాణ జిల్లాల్లో పుష్కర స్నానాలు జోరుగా సాగితే.. ఏపీలో మాత్రం ఆ హడావుడి కాస్త సద్దుమణిగింది. మంగళవారం తెలంగాణలోని ఐదు జిల్లాల్లో గోదావరి పుష్కరాల్లో 45 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో 15 లక్షలు.. నిజామాబాద్ జిల్లాలో 12 లక్షల మంది .. అదిలాబాద్ జిల్లాలో 7 లక్షలు.. వరంగల్ లో 6.5లక్షలు.. ఖమ్మం జిల్లాలో 5 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కర ఘాట్ల విషయంలో మాత్రం భద్రాచలంలో రద్దీ భారీగా సాగుతోంది.

ఇక.. ఏపీలో మాత్రం పుష్కరాల్లో భక్తుల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. తెలంగాణ జిల్లాల్లో నమోదైన భక్తజనంతో పోలిస్తే.. ఏపీలో భక్తుల సంఖ్య తక్కువగా నమోదైంది. మంగళవారం రెండు గోదావరి జిల్లాల్లో కలిపి కేవలం 34.03లక్షల మంది మాత్రమే భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. తెలంగాణ రాష్ట్రంలో పోలిస్తే.. దాదాపు పది లక్షల మంది భక్తులు తక్కువగా ఉన్నారు. బుధవారం నుంచి రద్దీ మొదలవుతుందని.. చివరి మూడు రోజులు భక్తుల రద్దీ మరింత భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భారీగా వచ్చే భక్తులకు తగ్గ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.