Begin typing your search above and press return to search.

పచ్చటి కుటుంబంలో పడవ ప్రమాద విషాదం

By:  Tupaki Desk   |   16 Sept 2019 5:40 PM IST
పచ్చటి కుటుంబంలో పడవ ప్రమాద విషాదం
X
తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు పడవ ప్రమాదం ఓ పచ్చటి కాపురంలో విషాదాన్ని నింపింది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన పెట్రోల్ బంక్ యజమాని దుర్గం సుబ్రహ్మణ్యం భార్య బిడ్డలతో కలిసి తన తండ్రి అస్తికలు గోదావరిలో కలపడానికి రాజమండ్రికి బోటుపై వెళ్లాడు. ఆ బోటు బోల్తాపడి దుర్గం సుబ్రహ్మణ్యం, ఆయన కూతురు చనిపోయింది. లైఫ్ జాకెట్ ఉండడం భార్య మధులత మాత్రమే బతికి బట్టకట్టింది. అయితే లైఫ్ జాకెట్ ను వేసుకున్న సుబ్రహ్మణ్యం మునిగిపోతున్న పడవను చూసి దాన్ని తీసి భార్యకు ఇచ్చి ఆమె ప్రాణాలు కాపాడాడట...

ఇదే విషయాన్ని తలుచుకొని భార్య మధులత కన్నీరు మున్నీరైంది. నా భర్త, పాప హాసిని కనిపించకుండా పోయారని.. తాను ఇక ఎవరి కోసం బతకాలని రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టింది. నన్ను కూడా దేవుడు తీసుకెళ్లిపోయింటే ఇంత బాధ ఉండేది కాదంటూ ఆమె రోదిస్తున్న వీడియోకు నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

కాగా చిన్నారి హాసిని ఈరోజు స్కూల్ తరుఫున ఫీల్డ్ ట్రిప్ నకు వెళ్లాల్సి ఉండేది. పడవ ప్రమాదంలో మృతిచెంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంపై తోటి విద్యార్థులు - ఉపాధ్యాయులు కన్నీళ్లతో నివాళులర్పించారు. పడవ ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన తీరుకు అందరూ సంతాపం తెలుపుతున్నారు.