Begin typing your search above and press return to search.

రాహుల్ అడ్డాలో..ఆయ‌న ఊహించ‌ని చేదు అనుభ‌వం!

By:  Tupaki Desk   |   25 Jan 2019 6:16 AM GMT
రాహుల్ అడ్డాలో..ఆయ‌న ఊహించ‌ని చేదు అనుభ‌వం!
X
చంటిగాడు లోక‌ల్ అంటూ అప్పుడెప్పుడో వ‌చ్చిన సినిమా సంగ‌తేమో కానీ.. ఆ డైలాగుతో ఎంతో మంది ఎన్నో ప‌నులు చేశార‌ని చెప్పాలి. ఎక్క‌డి దాకానో ఎందుకు మొన్న‌టి వ‌ర‌కూ టీవీ9లో జ‌ర్న‌లిస్ట్ గా ప‌ని చేసిన చంటి క్రాంతి సైతం త‌న ఇంటిపేరును ఎన్నిక‌ల నినాదంగా మార్చుకొని చంటిగాడు లోక‌ల్‌.. నాకు ఓటు వేయ‌రా? అంటూ చేసిన ప్ర‌చారం వ‌ర్క్ వుట్ కావ‌ట‌మే కాదు.. ఆయ‌న ఏకంగా ఎమ్మెల్యే అయిపోయారు.

నిన్న మొన్న‌టివ‌ర‌కూ జ‌ర్న‌లిస్టు క్రాంతి కాస్తా.. ఈ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా మారిపోయిన ప‌రిస్థితి. దీనికి కార‌ణం చంటిగాడు లోక‌ల్‌. మ‌రీ..మాట‌లోనే ఇంత ప‌వ‌ర్ ఉంటే.. చంటిగాడికి ఇంకెంత ప‌వ‌ర్ ఉంటుంది. అలాంటిది కాంగ్రెస్ అధినేత‌.. భావి భార‌త ప్ర‌ధానిగా కాంగ్రెస్ వ‌ర్గీయులు గొప్ప‌గా చెప్పుకునే రాహుల్ గాందీకి.. త‌న అడ్డా అయిన అమేఠీలో ఊహించ‌ని రీతిలో చేదు అనుభ‌వాన్ని ఎదుర్కొన్నారు.

లోక్ స‌భ ఎన్నిక ప్ర‌చారాన్ని ప్రారంభించ‌టానికి ముందు త‌న అడ్డా అయిన అమేఠీకి వెళ్లిన ఆయ‌న‌కు ఊహించ‌ని చేదు అనుభ‌వం ఎదురైంది. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లిన రాహుల్ గాంధీకి వ్య‌తిరేకంగా అక్క‌డి స్థానికులు ఫైర్ అయ్యారు. తిరిగి ఇట‌లీకి వెళ్లిపో.. ఇక్క‌డుండే అధికారం నీకు లేదంటూ భూములు కోల్పోయిన రైతులు నినాదాలు చేశారు.

షాకింగ్ గా మారిన ఈ నినాదాలు.. ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో రాహుల్ త‌న ప‌ని తాను చేసుకోలేక‌పోయారు. వారిని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత‌కీ.. రాహుల్ సొంత అడ్డా అయిన అమేఠీలో గాంధీ కుటుంబ స‌భ్యుల‌కు ఇలాంటి అవ‌మానం ఎందుకు ఎదురైందంటే.. గ‌తంలోకి కాస్త వెళ్లాల్సిందే.

1986లో అమేఠీలో సైకిల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు కోసం ప్ర‌భుత్వం ప‌లువురు రైతుల నుంచి 65.57 ఎక‌రాల్ని సేక‌రించింది. ఇందులో భాగంగా వారికి కొంత ప‌రిహారాన్ని ఇచ్చిన‌ట్లు చెబుతారు. ఇదిలా ఉంటే.. ఈ కంపెనీ త‌ర్వాత కాలంలో మూత‌ప‌డింది. దీంతో.. డెట్స్ రిక‌వ‌రీ ట్రైబ్యున‌ల్‌ లో 2014లో దీన్ని వేలం వేశారు. రూ.20.24 కోట్ల మొత్తానికి వేలం లో రాజీవ్ గాంధీ చారిట‌బుల్ ట్ర‌స్ట్ కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.5ల‌క్ష‌ల మొత్తాన్ని చెల్లించింది కూడా.

అప్ప‌టి నుంచి భూమి యాజ‌మాన్యం హ‌క్కులు రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్ కింద ఉన్నాయి. దీన్ని వ్య‌తిరేకిస్తున్న ప‌లువురు రైతులు ఆందోళ‌న చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజా నిర‌స‌న‌గా చెబుతున్నారు.

కొన్నింటి కోసం మ‌రికొన్నింటిని వ‌దులుకోవ‌టం స‌గ‌టు జీవులు చేస్తుంటారు. అలాంటిది రాహుల్ లాంటోళ్లు చేయ‌క‌పోతే ఎలా? అప్పుడెప్పుడోకొన్న భూముల కార‌ణంగా.. రాహుల్ ఇట‌లీ తిరిగి వెళ్లిపో అనే వ్యాఖ్య‌లు ప‌డాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. కీల‌క‌మైన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు సొంత అడ్డాలో వ్య‌తిరేకంగా ఉండ‌టం స‌రైన ప‌ద్ద‌తి కాదు. అందుకోస‌మే అయినా త‌న తండ్రిపేరిట ఉన్న భూమిని.. అప్ప‌ట్లో ప్ర‌భుత్వానికి ఇచ్చిన రైతుల్ని గుర్తించి వారి పేరిట ఇప్పిస్తే.. ఇప్పుడు వెళ్లిపోవాల‌న్న వారే..రేపు ప్రొద్దున వెళ్లొద్దు బాబు అన‌టం ఖాయం. అందుకోస‌మైనా పోయిన ప‌రువు అణాపైస‌ల‌తో స‌హా వెన‌క్కి తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకోసం భారీ విలువ ఉన్న భూమిని బ‌క్క రైతుల‌కు అప్ప‌జెప్పేస్తారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్త‌క‌రంగా మారింది.