Begin typing your search above and press return to search.

ఏపీ స‌మ‌స్య‌ల‌పై వెంక‌య్య‌ స్పందిస్తూనే ఉన్నారే!

By:  Tupaki Desk   |   23 Oct 2017 10:07 AM IST
ఏపీ స‌మ‌స్య‌ల‌పై వెంక‌య్య‌ స్పందిస్తూనే ఉన్నారే!
X
ప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడుకి త‌న సొంత రాష్ట్రం ఏపీపై మ‌మ‌కారం వీడ‌డం లేదు. ఇక్క‌డ ఎలాంటి స‌మ‌స్య ఎదురైనా ఆయ‌న వెంట‌నే స్పందిస్తున్నారు. గ‌తంలో కేంద్ర మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న ఏపీకి అన్ని విధాలా సాయం చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఉప‌రాష్ట్ర‌ప‌తిగా నామినేట్ అయ్యాక త‌న కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించే స‌మ‌యంలో చిట్ట‌చివ‌రి సంత‌కం ఏపీకి ఇళ్ల కేటాయింపుపైనే చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇక‌, విభ‌జ‌న స‌మ‌స్య‌లు - రాజ‌ధాని - పోల‌వ‌రం ప్రాజెక్టు నిధులు వంటి స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న కేంద్రంలో మంత్రిగా ఉన్న స‌మ‌యంలో మంత్రులంద‌రినీ త‌న ఛాంబ‌ర్‌ కు పిలిపించుకుని ఏపీ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయి వాటికి ప‌రిష్కారాలు కూడా చూపించారు. ఇలా ఆయ‌న ఢిల్లీలో ఉన్న‌ప్ప‌టికీ ఏపీపై అభిమానం - మ‌మ‌కారం చూపుతూనే ఉన్నారు.

అయితే, ఇప్పుడు ఆయ‌న రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉప రాష్ట్ర‌ప‌తిగా దేశ రెండో పౌరుడిగా ఉన్నారు. అదీకాక‌ - నిన్న‌నే ఆయ‌న గుండెకు సంబంధించిన అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. ఇంత‌లా ఆయ‌న అనారోగ్యంతో ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీలో ఎదుర‌వుతున్న స‌మ‌స్యల‌పై శ‌ర‌వేగంగా స్పందిస్తున్నారు. ఈ విష‌యంలో ఆయ‌న త‌న ప‌ద‌విని సైతం ప‌క్క‌న పెట్టి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో అధికారుల నిర్వాకం - టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా అక్క‌డి కుష్ఠు వ్యాధి గ్ర‌స్తులు రేష‌న్ పొంద‌లేక పోతున్నారు. గ‌త కొన్నాళ్లుగా ఈ స‌మ‌స్య ఉంది.ఈ క్ర‌మంలో ఆదివారం ఈ ఘ‌ట‌న ప‌లు తెలుగు ప‌త్రిక‌ల్లో ప్ర‌ముఖంగా వ‌చ్చింది. ఢిల్లీలో ఉన్న వెంక‌య్య తెలుగు ప‌త్రిక‌లు చ‌దివే క్ర‌మంలో ఆయ‌న‌కు ఈ స‌మ‌స్య క‌నిపించింది. వెంట‌నే ఆయ‌న ఉప రాష్ట్ర‌ప‌తి అనే హోదాను సైతం ప‌క్క‌న పెట్టి స్పందించారు.

గుంటూరు జిల్లాలోని ఓబులేశునిపల్లెలో కుష్టు వ్యాధిగ్రస్తులకు రేషన్‌ అందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ కి విజ్ఞప్తి చేశారు. వారికి బొటనవేలు కానీ ఇతర చేతి వేళ్లు లేకపోవడం వల్ల బయోమెట్రిక్‌ లో వేలిముద్రలు వేయలేకపోయారని - అందువల్ల రేషన్‌ ఇచ్చేందుకు నిరాకరించారని పేప‌ర్‌ లో చ‌దివిన‌ట్టు ఆయ‌న చెప్పారు. వారికి వేళ్లు లేవ‌నే కార‌ణంగా రేష‌న్‌ ను నిలిపి వేయ‌డం స‌మంజ‌సం కాద‌ని హెచ్చ‌రించారు. ఈ మేర‌కు సీఎస్‌ కు వెంకయ్యనాయుడు ఫోన్‌ చేశారు. వెంట‌నే ల‌బ్ధిదారుల‌కు రేష‌న్ అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ బాధితులకు వెంటనే రేషన్‌ అందేలా చూస్తామని వెంక‌య్య‌కు హామీ ఇచ్చారు. ఈ ఉదంతం.. వెంక‌య్య‌కు ఏపీపై ఉన్న మ‌మ‌కారాన్ని మ‌రోసారి స్ప‌ష్టం చేసింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.