Begin typing your search above and press return to search.

అప్పులు ఇవ్వండి నేను మంత్రిన‌వుతున్నా: వైసీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   9 Feb 2022 12:30 PM GMT
అప్పులు ఇవ్వండి నేను మంత్రిన‌వుతున్నా: వైసీపీ ఎమ్మెల్యే
X
ఏపీ సీఎం జ‌గ‌న్ చేయాల్సిన ముఖ్య‌మైన ఒక‌టి పెండింగ్‌లోనే ఉంటుంది. అదేంటంటే.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడే రెండున్న‌రేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అప్పుడు మంత్రి ప‌ద‌వి రాని వాళ్లు దిగులు ప‌డొద్ద‌ని.. వైసీపీ ప్ర‌భుత్వం స‌గం ప‌దవీ కాలం పూర్తికాగానే కొత్త కేబినేట్ ప్ర‌క‌టిస్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు.

ఇప్పుడు రెండున్న‌రేళ్లూ పూర్త‌యింది. దీంతో కొత్త‌గా మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు జ‌గ‌న్ నిర్ణ‌యం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ ఎమ్మెల్యే ప‌రిస్థితి మాత్రం విచిత్రంగా ఉంద‌నే చెప్పాలి. తాను చేసిన అప్పుల‌ను తీర్చుకోవ‌డానికి ఆయ‌న మంత్రిని అవుతున్నాన‌ని చెప్పుకుంటున్నార‌ని తెలిసింది.

జ‌గ‌న్ పేరుతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లు కూడా మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ ప‌డుతున్నార‌ని స‌మాచారం. ఈ శివ‌రాత్రికి కొత్త మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టిస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అప్పుల్లో కూరుకుపోయిన ఓ ఎమ్మెల్యే మాత్రం త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అప్పుడు అవి తీర్చేస్తాన‌ని చెప్పుకుంటున్నారంటా. అంతే కాకుండా కొత్త‌గా అప్పులు ఇవ్వ‌మ‌ని కూడా కోరుతున్నార‌ని తెలిసింది.

ఆ వైసీపీ ఎమ్మెల్యే పీక‌ల్లోతు అప్పుల్లో మునిగిపోయార‌ని తెలిసింది. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తన నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల కాంట్రాక్టుల‌న్నీ ఆయ‌నే తీసుకున్నార‌ని స‌మాచారం. కానీ తీరా వాటికి సంబంధించిన బిల్లులు రాబ‌ట్ట‌కుందామంటే ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర నిధులు లేవు.

ఓ వైపేమో అప్పు తెచ్చిన డ‌బ్బుల‌తో చేపించిన ప‌నుల‌కు నిధులు విడుద‌ల కావ‌డం లేదు.. మ‌రోవైపు అప్పులిచ్చిన వాళ్లు తిరిగి ఇవ్వ‌మ‌ని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యే రాబోయే మంత్రి వ‌ర్గంలో త‌న‌కు చోటు ద‌క్కుతుంద‌ని అప్పుడు అప్పులు చెల్లిస్తాన‌ని చెప్పారంటా. మంత్రి అయ్యాక బాగా సంపాదించి అప్పులు తీరుస్తాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేశార‌ని కానీ ఆ ఎమ్మెల్యే మంత్రి అయ్యాక ఎలా సంపాదిస్తార‌ని కొంత‌మంది ప్ర‌శ్నిస్తున్నారు. ఎలాగోలా తిరిగి డ‌బ్బులు రాబ‌ట్టుకోవాల‌ని వాళ్లు చూస్తున్నారు. మ‌రోవైపు ఆ నియోజ‌క‌వర్గ టీడీపీ ఇంఛార్జీ మాత్రం అప్పులు ఇచ్చిన వాళ్ల‌కు ఫోన్లు చేసి వెంట‌నే తిరిగి రాబ‌ట్టుకోవాల‌ని సూచిస్తున్నారంటా. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఎలాగో ఆ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వ‌రని అందుకే ముందుగానే అప్పులు రాబ‌ట్టుకోవాల‌ని వాళ్ల‌కు ఫోన్ల‌లో చెబుతున్నార‌ని తెలిసింది.