Begin typing your search above and press return to search.

గీతం చెరలోని 40 ఎకరాలకు మోక్షం లభించిందా?

By:  Tupaki Desk   |   23 Oct 2020 2:00 PM IST
గీతం చెరలోని 40 ఎకరాలకు మోక్షం లభించిందా?
X
సంవత్సరాల తరబడి విశాఖపట్నం జిల్లాలోని రుషికొండ - ఎందాడ ప్రాంతాల్లో గీతం యూనివర్సిటి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాల భూములకు మోక్షం లభించినట్లే అనిపిస్తోంది. గీతం చెరలో నుండి 40 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవటానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసినందుకు గీతం యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ ప్రభుత్వం అండతోనే గీతం యాజమాన్యాం రుషికొండ - ఎందాడ ప్రాంతంలో 40.51 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు జిల్లా రెవిన్యు యంత్రాంగం తేల్చింది.

ఎందాడలోని కొన్ని సర్వే నెంబర్లలోని 22.21 ఎకారల భూమిని ఆక్రమించేసి కాంపౌండ్ వాల్ కూడా కట్టుకున్నట్లు రెవిన్యు అధికారుల పరిశీలనలో తేలింది. ఇదే విదంగా మరో సర్వే నెంబర్ లోని 18.30 ఎకారాల్లో గీతం యూనివర్సిటి గార్డెనింగ్ తో పాటు గ్రావెల్ బండ్ ను ఏర్పాటు చేసుకున్నట్లు అదికారులు నిర్ధారించారు. ఈ ఆక్రమణలపై విశాఖపట్నం ఆర్డీవో పెంచల్ కిషోర్ ఇచ్చిన నివేదిక - ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ మొదలుపెట్టింది. గీతం విద్యాసంస్ధ ఏర్పాటుకు 71.15 ఎకరాల భూమిని కేటాయించాలంటూ 1981లో యాజమాన్యం ప్రభుత్వాన్నికోరింది. తమకు భూమి ఎక్కడ కావాలో - ఏ సర్వేలో ఉన్న భూమి కావాలో కూడా యాజమాన్యమే ప్రభుత్వానికి సూచించింది.

అయితే గీతం యాజమాన్యం సూచించిన భూమిని అప్పటికే ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్ధలాలుగా కేటాయించింది. వివిధ కారణాల వల్ల మళ్ళీ వెనక్కు కూడా తీసుకుంది. ఆ విషయం తెలిసే యాజమాన్యం అదే భూమిని అడిగింది. మొత్తానికి ప్రభుత్వం యాజమాన్యానికి భూమిని ఇవ్వటానికి అంగీకరించింది. అయితే యాజమాన్యానికి ఎటువంటి హక్కులు ఇవ్వకుండానే స్ధలంలో ఎటువంటి శాశ్వత భవనాలు నిర్మించేందుకు లేదనే కండీషన్ పెట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొత్తం భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామనే కండీషన్ చాలా కీలకం.

ప్రభుత్వం విధించిన అన్నీ కండీషన్లకు యాజమాన్యం అంగీకరించటంతో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసింది. అయితే భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత యాజమాన్యం 14 ఎకరాల్లో శాశ్వత భవనాలను నిర్మించిన యాజమాన్యం మిగిలిన భూమిని 15 ఏళ్ళపాటు ఖళీగానే ఉంచింది. ఇదే విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదు రావటంతో నిర్మాణాలున్న స్ధలాన్ని, ఖాళీగా ఉన్న స్ధలాన్ని పరిశీలించిన రెవిన్యు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న స్ధలంలో 8ఎకరాలను మాత్రం ఉంచుకుని మిగిలిన 49 ఎకరాలను వెంటనే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలంటూ నోటీసులు ఇచ్చింది యాజమాన్యానికి. తర్వాత 1998లో ప్రభుత్వం పై భూమిని స్వాధీనం కూడా చేసుకుంది.

అయితే ఆ తర్వాత యాజమాన్యం 40 .51 ఎకరాలను ఆక్రమించినట్లు రెవిన్యు అధికారులు గుర్తించారు. అయితే ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఆ భూమిని యాజమాన్యానికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఎకర రూ. 18 వేలుగా ధర నిర్ణయించింది. పనిలో పనిగా 1981 నుండి ఏడాదికి ప్రభుత్వం నిర్ణయించిన ధరపై 10 శాతం వడ్డీ కట్టాలని కూడా నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించేసిన యాజమాన్యం భూమిని స్వాధీనం చేసేసుకుంది. ఇక అప్పటి నుండి ఆ భూమికి పక్కనున్న ఇతర భూములను కూడా కబ్జా చేయటం మొదలుపెట్టింది.

తర్వాత రకరకాల మలుపులు తిరిగిన భూ కబ్జా పర్వం చివరకు విచారణ పేరుతో సిట్ ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం రకరకాల కేసులతో కోర్టుల విచారణలో ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ. 8.4 కోట్లు చెల్లించి సొంతం చేసుకోమని ప్రభుత్వం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా స్పందన కనబడలేదు. అంటే హోలు మొత్తం మీద చూస్తే 40.51 ఎకరాల ప్రభుత్వ భూమి గీతం కబ్జాలోనే ఉందని నిర్ధారమైంది. మరి సిట్ విచారణలో ఏమి తేలుతుందో చూడాల్సిందే.