Begin typing your search above and press return to search.

అధికార పార్టీకి గ‌ట్టి షాక్ తగిలింది

By:  Tupaki Desk   |   25 July 2016 10:40 AM IST
అధికార పార్టీకి గ‌ట్టి షాక్ తగిలింది
X
ప్ర‌జ‌ల మ‌న్న‌న పొందేలా ప‌రిపాల‌న చేయ‌మని అధికారం అప్ప‌గిస్తే ఆందోళ‌నే మా పంథా అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. ఢిల్లీలో రహదారిపై ధర్నా చేస్తోన్న అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ శ్రేణులను ఓ యువతి నిలదీసిన ఘటన దేశ వ్యాప్తంగా హల్‌చల్‌ సృష్టిస్తోంది. సామాన్యులు వెద‌వ‌ల్లాగా క‌నిపిస్తున్నారా? అంటూ ఆ యువ‌తి ఫైరయింది. దీంతో షాక్ అవ‌డం ఆప్ నేత‌ల వంత‌యింది.

ఓ యువతిని బెదిరించిన కేసులో ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ ను పోలీసులు అరెస్టు చేయగా, దీనిని నిరసిస్తూ ఆప్‌ శ్రేణులు రోడ్డుపై ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. ఇదే సమయంలో ఆస్పత్రికి అత్యవసర పరిస్థితిలో వెళ్తున్న ఓ యువతి కారు నడిరోడ్డుపై ఆగిపోయింది. దీంతో ఆమె కారు దిగి ధర్నా స్థలికి చేరుకుని.. ‘అసలేం జరుగుతుంది, ఏం చేస్తున్నారు..?, రోజుకో వేషాలు వేస్తున్నారా..?, ట్రాఫిక్‌ క్లియర్‌ చేయండి.. ఆస్పత్రికి వెళ్లాలి’ అని చెప్పింది. ఇంతలో ఓ ఆప్‌ కార్యకర్త ‘మేం వెళ్లనివ్వం - ఏం చేసుకుంటారో చేస్కోండి’ అని చెప్పడంతో ఆగ్రహానికి గురైన ఆ యువతి అతడి చొక్కా పట్టుకుని ‘సామాన్యులు మీకు వెదవల్లా కనిపిస్తున్నారా., ఇలాగేనా నిరసనలు చేసేది..? మాకు ఎందుకు సమస్యలు సృష్టిస్తున్నారు..? మీ ఒక్క ఎమ్మెల్యే కోసం వేల మంది బాధపడాలా..’ అని ప్రశ్నించింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని..ఆ యువతి, ఆప్‌ శ్రేణులకు సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.