Begin typing your search above and press return to search.

మోడీకి జగన్ ఇచ్చిన బహుమతులెన్నో...?

By:  Tupaki Desk   |   17 Sep 2022 12:30 AM GMT
మోడీకి జగన్ ఇచ్చిన బహుమతులెన్నో...?
X
ఆయన దేశానికి ప్రధాని. ఈయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. జగన్ సీఎం గా బాధ్యతలు స్వీకరించి దాదాపుగా మూడున్నరేళ్ళు కావస్తోంది. ఆయన ఈ మధ్యకాలంలో ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. అలా హస్తినకు వెళ్ళిన ప్రతీసారి ప్రధాని మోడీని కలిసేవారు. ఇక జగన్ మోడీని కలిస్తే ఒక ఖరీదైన శాలువాతో పాటు అంతకంటే ఖరీదైన శ్రీవెంకటేశ్వరరస్వామి వారి విగ్రహాన్ని బహుమతిగా ఇస్తూ వచ్చారు. ఇలా జగన్ ఎన్నో సార్లు చేశారు.

దాంతో మోడీకి ప్రధానిగా వచ్చిన బహుమతులు చూస్తే ఏపీ సీఎం జగన్ ఇచ్చినన్ని బహుమతులు మిగిలిన రాష్ట్రాల సీఎం లు కూడా ఇవ్వలేదు అనే అంటున్నారు. ప్రత్యేకించి చూస్తే కేసీయార్ మోడీని చాలా తక్కువ సార్లు కలిశారు. అలాగే పొరుగున ఉన్న తమిళనాడు సీఎం అయితే ఏణ్ణర్ధం సీఎం ఏలుబడిలో ఒకటో రెండోసార్లు కలసి ఉంటారు. కేరళ సీఎం కూడా అంతే. ఒక ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ని చూసుకుంటే ఆయన భువనేశ్వర్ వదిలి అసలు కదిలిరారు. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ అయితే ప్రధానితో భేటీ అంటేనే పెద్దగా ఇష్టపడరంతే.

అంటే బీజేపీయేతర సీఎంల జాబితా తీస్తే కచ్చితంగా జగనే మోడీని ఎక్కువసార్లు కలిసింది. కలిసినన్ని సార్లూ ఆయనకు బహుమతులు ఇచ్చింది కూడా జగనే అని అంటున్నారు. ఇదంతా ఎందుకంటే ప్రధాని మోడీ తనకు వచ్చిన బహుమతులను వేలం వేసి నమామి గంగే ప్రాజెక్టునకు విరాళంగా ఆ సొమ్ము ఇవ్వబోతున్నారు. దాంతో మోడీకి వచ్చిన బహుమతులను అన్నీ వేలానికి పెట్టారు. మూడు కోట్ల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక బహుమతుల విషయాన చూస్తే కనుక ప్రధానికి జగన్ సీఎం హోదాలో ఇచ్చినవే ఎక్కువగా అక్కడ కనిపిస్తున్నాయి. శ్రీ తిరుపతి వెంకటేశ్వరరస్వామి వారి విగ్రహాలను జగన్ మోడీకి బహుమతిగా ఎక్కువగా ఇచ్చారు. అలా ఇచ్చిన వాటిలో ఒక్కో విగ్రహం దాని నగిషీ బట్టి డిజైన్ల బట్టి యాభై వేల పై చిలుకుగా సర్కార్ వారి పాటగా పెట్టి వేలంలో ఉంచారు. మరి ఎంత రేటుకు ఈ విగ్రహాలు అమ్ముడవుతాయన్నది చూడాలి. ఆ విధంగా జగన్ బహుమతులు ఎంత మొత్తంలో కలెక్ట్ చేస్తాయి అన్నది కూడా ఆసక్తికరమైన విషయంగా ఉంది.

ఏది ఏమైనా ఇక్కడ ఒక్క మాట ఉంది. మోడీ కోసం తరచూ ఢిల్లీ వెళ్ళి జగన్ ఇలా బహుమతులు ఇస్తూ వచ్చారు. ఇపుడు వేలం రూపంలో కూడా అవి నమామీ గంగే ప్రాజెక్టుకు బాగానే ఉపయోగపడబోతున్నాయి.

అంతా బాగానే ఉంది కానీ జగన్ ఇచ్చిన బహుమతులకు అయినా కేంద్రం ఏపీకి ఎంత మేరకు సాయం చేసింది అన్నదే ఇక్కడ ప్రశ్న. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు, పోలవరం వంటి వాటి విషయంలో కేంద్రం మూడున్నరేళ్ల జగన్ ఏలుబడిలో ఏపీకి ఎంత చేసింది అన్నదే అతి పెద్ద చర్చ. మొత్తానికి మోడీకి బహుమతులు ఇవ్వడంతో ముందున్న ఏపీకి నిధుల విషయంలో ఎక్కడ ఉందో కేంద్రం అయినా ఆ వివరాలు చెబితే బాగుంటుందేమో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.