Begin typing your search above and press return to search.

మాట తప్పుతాం..మోసం చేస్తాం: సజ్జల

By:  Tupaki Desk   |   24 Dec 2018 10:29 AM GMT
మాట తప్పుతాం..మోసం చేస్తాం: సజ్జల
X
‘మాట తప్పుతాం.. మోసం చేస్తాం.. మా పార్టీ మా ఇష్టం.. “ అంటూ రెచ్చిపోయాడట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వెంట తరచూ కనిపించే, ఆ పార్టీ నేత అయిన సజ్జల ఇలా మాట్లాడాడు అని తెలుస్తోంది. గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సజ్జల ఇలా వ్యాఖ్యానించడని సమాచారం. మాట తప్పం.. మడమ తిప్పం అంటూ వైఎస్ జగన్ తరచూ చెబుతూ ఉంటారు. ఈ విషయం గురించి కార్యకర్తలు సజ్జల వద్ద ప్రస్తావిస్తే.. దానికి ఆయన రెచ్చిపోయినట్టుగా తెలుస్తోంది. కార్యకర్తల మీద దుర్భాషలు ఆడుతూ.. మాట తప్పుతాం.. మోసం చేస్తాం.. అంటూ వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.

ఇటీవల గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని పరిణామాలు చోటు చేసుకొంటూ ఉన్నాయి. ఇక్కడ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన అన్నా రాంబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసహనం నెలకొని ఉంది. అన్నా రాంబాబును పార్టీలోకి చేర్చుకోవడంపై పార్టీ అభిమానుల్లో కార్యకర్తల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ విధమైన అసహనం నెలకొని ఉంది.

గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గిన రోజుల నుంచినే నియోజకవర్గంలో వైఎస్ అభిమానుల మీద అన్నా రాంబాబు దాడులు చేయించాడు. ప్రత్యేకించి ఒక సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అన్నా రాంబాబు రౌడీయిజం చెలాయించాడు. ఇప్పుడు వైకాపాకు అదే సామాజికవర్గం అండగా ఉంది. నియోజకవర్గంలో జనాభా రీత్యా కూడా వారు గణనీయంగా ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో అన్నా రాంబాబును వైసీపీలోకి చేర్చుకోవడంపై వారిలో అసహనం నెలకొని ఉంది. స్థానిక పరిస్థితులను పట్టించుకోకుండా వైసీపీలోని కొంతమంది వ్యక్తులు అన్నా రాంబాబును చేర్చుకోవాలని జగన్ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక అన్నా రాంబాబు ఒక కేసులో ఐదేళ్ల శిక్షను కూడా ఎదుర్కొంటున్నాడు. దానిపై పై కోర్టుకు అప్పీల్ కు వెళ్లాడట. ఒకవేళ ఐదేళ్ల శిక్ష ఆయనకు ఖరారు అయితే.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా అనర్హుడు అవుతాడు. ఇలాంటి నేపథ్యంలో కూడా ఆయనను వైసీపీలోకి చేర్చారు. ఈయన గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడాడు. నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఫిరాయించడంతో రాంబాబును అక్కడ కూడా పట్టించుకోలేదు.కొన్నాళ్ల కిందట టీడీపీకి రాజీనామా చేసి, ఇప్పుడు వైసీపీలోకి చేరాడు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ తరఫున సంవత్సరాలుగా పని చేస్తున్న నేతలు, కార్యకర్తలు అసహనంతో ఉన్నారు.

పై విషయాలను పరిగణనలోకి తీసుకుని రాంబాబును పార్టీలోకి చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు సజ్జలను నిలదీశారు. అన్నా రాంబాబు వైసీపీలోకి చేరడం వెనుక సజ్జలదే ముఖ్య పాత్ర అని తెలుస్తోంది.

కార్యకర్తలు ఈ విషయంలో నిలదీయడంతో సజ్జలకు కోపం పొడుచుకువచ్చిందట. మూడేళ్లుగా వైసీపీలో యాక్టివ్ గా ఉండి.. కష్టపడి పని చేసిన వాళ్లకు అప్పుడేమో మాట ఇచ్చారు, ఇప్పుడు ఆ మాట తప్పుతారా? అని కార్యకర్తలు సజ్జలను ప్రశ్నించారు. దీంతో సజ్జల రెచ్చిపోయినట్టుగా తెలుస్తోంది.

మా పార్టీ.. మా ఇష్టం.. మాట తప్పుతాం, మోసం చేస్తాం.. అంటూ వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. ఆయన మాట తీరుతో కార్యకర్తల్లో మరింత అసహనం పెరిగింది. వాతావరణం ఉద్రిక్తంగా మారి ఆయనపై దాడికి కూడా కార్యకర్తలు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. మీ లాంటి వారి వల్లనే గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది అంటూ.. కార్యకర్తలు మండి పడినట్టుగా సమాచారం. పరిస్థితి తేడా మారుతుండటంలో.. సజ్జల రామకృష్ణా రెడ్డి అక్కడ నుంచి టక్కున ఉడాయించినట్టుగా తెలుస్తోంది.