Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ కేసీఆర్‌...ఢిల్లీ నుంచి ఆ పెద్దాయ‌న రాక‌

By:  Tupaki Desk   |   24 Aug 2018 7:47 AM GMT
ఆప‌రేష‌న్ కేసీఆర్‌...ఢిల్లీ నుంచి ఆ పెద్దాయ‌న రాక‌
X
తెలంగాణలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా ప‌రిణామాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఎత్తుల‌కు పై ఎత్తులు వేసేందుకు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మ‌వుతోంది. తెలంగాణ‌ను ఆనుకొని ఉన్న క‌ర్నాట‌క‌లో చేసిన ఆప‌రేష‌న్ స‌ఫ‌లం అయిన నేప‌థ్యంలో అదే త‌ర‌హా స్కెచ్‌ను ఈ రాష్ట్రంలో అమ‌ల్లో పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మైందని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. `ఆప‌రేష‌న్ కేసీఆర్‌`పేరుతో సాగే ఈ ఆప‌రేష‌న్‌ కు సార‌థ్యం వ‌హిస్తోంది కాంగ్రెస్ ర‌థ‌సార‌థులు అయిన సోనియాగాంధీ - రాహుల్ గాంధీల న‌మ్మిన‌బంటు కాంగ్రెస్ జాతీయ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్. శ‌నివారం ఆయ‌న తెలంగాణకు రానుండ‌టం - రెండు రోజుల పర్యటన చేయ‌నుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పార్టీలోని ముఖ్య‌నేత‌ల స‌మాచారం.

ఇటీవ‌ల జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఉత్కంఠ భ‌రిత ప‌రిణామాల మ‌ధ్య క‌న్న‌డ ట్విస్ట్‌ కు ముగింపు ప‌డిన సంగ‌తి తెలిసిందే. కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను కాంగ్రెస్‌కు అనుకూలంగా మల్చడంలో ఆజాద్‌ కీలకంగా మారడమే కాకుండా బీజేపీ చర్యలకు వ్యతిరేకంగా పావులు కదిపారు. త‌ద్వారా కాంగ్రెస్ త‌న అధికార‌ పీఠాన్ని నిల‌బెట్టుకోవాల‌ని చేసిన ఆ ఆప‌రేష‌న్‌ ను విజ‌య‌వంతంగా పూర్తిచేసింది. అయితే ఈ ఎపిసోడ్‌ ను అధ్య‌య‌నం చేసిన కాంగ్రెస్ త‌న త‌ర్వాతి ఆప‌రేష‌న్‌ గా తెలంగాణ‌ను ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్‌ చార్జ్‌ గా వ్య‌వ‌హ‌రించిన‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత - కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్‌ ను ప్ర‌త్యేక దూత‌గా పంపించాలని నిర్ణయం తీసుకున్నారని స‌మాచారం.

సుదీర్ఘ‌కాల డిమాండ్ అయిన ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌యిన కాంగ్రెస్ పార్టీ అనంతరం అనేక కుదుపుల‌ను ఎదుర్కుంది. ఇటీవ‌లి కాలంలో ఆ పార్టీ ఒకింత పుంజుకుంటోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని కాంగ్రెస్‌ వర్గాల స‌మాచారం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే చురుకైన వ్యూహకర్త తెలంగాణకు అవసరమని పలువురు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్‌ కు కూడా పలువురు నేతలు వివరించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ గా రామచంద్ర కుంతియా కొనసాగుతున్నప్పటికీ ముఖ్యనేతల మధ్య ఉన్న విబేధాలను చక్క దిద్దడంలో ఇబ్బంది పడుతున్నారని పార్టీ హైకమాండ్‌ గుర్తించినట్లుగా సమాచారం. దీంతో ప్ర‌స్తుత ఇంచార్జీ ఆర్సీ కుంతియాను మార్చాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, ఆయ‌న్ను కొన‌సాగిస్తూనే...వ్యూహ‌ర‌చ‌న కోసం ఆజాద్‌ కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నార‌ని తెలుస్తోంది. దీంతోపాటుగా ఆజాద్‌ ను రాష్ర్టానికి ర‌ప్పించ‌డం వెనుక మ‌త‌ప‌ర‌మైన ఎత్తుగ‌డ‌లు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ముస్లిం - మైనార్టీల ఓటు గణనీయంగా ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీకి మొదటి నుంచి ముస్లిం ఓటు బ్యాంక్‌ అండగా ఉండేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆ వర్గం ఓట్లు కొంత దూరం కావడమే కాకుండా మజ్లిస్‌ పార్టీ కూడా కాంగ్రెస్‌ కు దూరమైన విషయాన్ని పలువురు కాంగ్రెస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ గా రావడం వల్ల ఆ వర్గం ఓట్లు కూడా కాంగ్రెస్‌ కు అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయని పార్టీ లెక్క‌లు వేస్తోంది. ఇందులో భాగంగానే ఆజాద్ రెండు రోజుల ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని, ఆదివారం గాంధీభవన్ లో ఉదయం 12 గంటలకు ఆజాద్ ప్రెస్‌ మీట్ పెట్ట‌డం కూడా ఈ ఎత్తుగ‌డల్లో భాగ‌మ‌ని చెప్తున్నారు.