Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ కేసీఆర్ స్టార్ట్‌..ఆజాద్‌ తో అదే స‌మ‌స్య‌

By:  Tupaki Desk   |   28 May 2018 4:52 PM GMT
ఆప‌రేష‌న్ కేసీఆర్ స్టార్ట్‌..ఆజాద్‌ తో అదే స‌మ‌స్య‌
X
తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ‌ను ఆనుకొని ఉన్న క‌ర్నాట‌క‌లో చేసిన ఆప‌రేష‌న్ స‌ఫ‌లం అయిన నేప‌థ్యంలో అదే త‌ర‌హా స్కెచ్‌ను ఈ రాష్ట్రంలో అమ‌ల్లో పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఆప‌రేష‌న్ కేసీఆర్‌ ను మొద‌లుపెట్టార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. దీనంత‌టికీ కార‌ణం...తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీగా సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి ఆజాద్ నియామ‌కమే. ఉత్కంఠ భ‌రిత ప‌రిణామాల మ‌ధ్య క‌న్న‌డ ట్విస్ట్‌ కు ముగింపు ప‌డిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ త‌న అధికార‌ పీఠాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని చూసి ఆ ఆప‌రేష‌న్‌ ను విజ‌య‌వంతంగా పూర్తిచేసింది. అయితే ఈ ఎపిసోడ్‌ ను అధ్య‌య‌నం చేసిన కాంగ్రెస్ త‌న త‌ర్వాతి ఆప‌రేష‌న్‌ గా తెలంగాణ‌ను ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ గా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత - కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్‌ ను పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌యిన కాంగ్రెస్ పార్టీ అనంతరం అనేక కుదుపుల‌ను ఎదుర్కుంది. ఇటీవ‌లి కాలంలో ఆ పార్టీ ఒకింత పుంజుకుంటోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని కాంగ్రెస్‌ వర్గాల స‌మాచారం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే చురుకైన వ్యూహకర్త తెలంగాణకు అవసరమని పలువురు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్‌కు కూడా పలువురు నేతలు వివరించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా రామచంద్ర కుంతియా కొనసాగుతున్నప్పటికీ ముఖ్యనేతల మధ్య ఉన్న విబేధాలను చక్క దిద్దడంలో ఇబ్బంది పడుతున్నారని పార్టీ హైకమాండ్‌ గుర్తించినట్లుగా సమాచారం. దీంతో ప్ర‌స్తుత ఇంచార్జీ ఆర్సీ కుంతియాను మార్చాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందుకోసం క‌న్న‌డ రాజ‌కీయాల‌ను ఉదాహ‌ర‌ణ‌ను తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను కాంగ్రెస్‌కు అనుకూలంగా మల్చడంలో ఆజాద్‌ కీలకంగా మారడమే కాకుండా బీజేపీ చర్యలకు వ్యతిరేకంగా పావులు కదిపారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌కు ఆయ‌న్ను ఇంచార్జీగా నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు.

రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దాలంటే ఆజాద్‌ సేవలు రాష్ట్రానికి అవసరమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీనియర్లలో నెలకొన్న విభేదాలను చక్కదిద్దడంతో పాటు, కాంగ్రెస్‌ను వీడి వివిధ పార్టీల్లోకి వలస వెళ్లిన వారిని కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని పార్టీ హైకమాండ్‌ ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య సఖ్యత ఉండాలంటే సీనియర్‌ నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడైన గులాంనబీ ఆజాద్‌ను తెలంగాణకు పంపించాలనే అభిప్రాయానికి వచ్చి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతోపాటుగా ఆజాద్‌ను రాష్ర్టానికి ర‌ప్పించ‌డం వెనుక మ‌త‌ప‌ర‌మైన ఎత్తుగ‌డ‌లు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ముస్లిం, మైనార్టీల ఓటు గణనీయంగా ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీకి మొదటి నుంచి ముస్లిం ఓటు బ్యాంక్‌ అండగా ఉండేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆ వర్గం ఓట్లు కొంత దూరం కావడమే కాకుండా మజ్లిస్‌ పార్టీ కూడా కాంగ్రెస్‌కు దూరమైన విషయాన్ని పలువురు కాంగ్రెస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా రావడం వల్ల ఆ వర్గం ఓట్లు కూడా కాంగ్రెస్‌ కు అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయని పార్టీ లెక్క‌లు వేస్తోంది. అయితే గులాం న‌బీ ఆజాద్ ఇంచార్జీగా ఉంటే ``ఒక వ‌ర్గం`` వారికే ప్రాధాన్యత ఇస్తార‌ని గ‌తంలో ఈ విధంగా కొంద‌రిని అనూహ్య రీతిలో పైకి తీసుకువెళ్లార‌ని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు అభ్యంత‌రం తెలిపారు. అయిన‌ప్ప‌టికీ వాటిని ప‌క్క‌న‌పెట్టి ఈ నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో గ్రూపు రాజ‌కీయాలు ఎలా కొలిక్కి వ‌స్తాయో అనే చ‌ర్చ కూడా తెర‌మీద‌కు వ‌స్తోంది.