Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు కొత్త బిరుదు ఇచ్చిన కాంగ్రెస్ పెద్దాయ‌న‌

By:  Tupaki Desk   |   21 Sep 2018 4:27 AM GMT
కేసీఆర్‌ కు కొత్త బిరుదు ఇచ్చిన కాంగ్రెస్ పెద్దాయ‌న‌
X
తెలంగాణ అప‌ద్ధ‌ర్మ‌ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ పై విరుచుకుప‌డటంలో ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోని కాంగ్రెస్ పార్టీ త‌న అస్త్రాల‌కు మ‌రింత ప‌దును పెడుతోంది. ఓవైపు కేసీఆర్ వ్య‌క్తిత్వం మ‌రోవైపు ఆయ‌న ప‌రిపాల‌న తీరును తీవ్రంగా ఎండ‌గడుతోంది. ఇప్ప‌టికే ఈ ప‌నుల్లో రాష్ట్ర నేత‌లు బిజీగా ఉండ‌గా వారికి కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తోడ‌య్యారు. రెండు రోజుల రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం గాంధీభ‌వ‌న్‌ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తీరుపై విరుచుకుప‌డ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ ఎస్ పాత్ర ఏమీలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఏకగ్రీవంగా కోరారని గుర్తు చేసుకున్న ఆజాద్... తెలంగాణ ఎంపీలు రాష్ట్రం కోసం చేసిన పోరటం వల్లే రాష్ట్రం ఏర్పడిందని... అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా పోరాటం చేశారన్నారు.

తెలంగాణ పోరాటంలో టీఆర్ ఎస్ పాత్ర శూన్యమని కొట్టిపారేసిన ఆజాద్ ఈ సంద‌ర్భంగా కేసీఆర్ తీరుపైనా విరుచుకుప‌డ్డారు. గ‌ల్లీలో - ఢిల్లీలో స్టేట్‌ మెంట్స్ ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే టీఆర్ ఎస్‌ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్ చీట్ చేశారని... అక్కడ నుండే చీటింగ్ మొదలైందన్నారు. దేశంలోనే అబద్దాలు - తప్పుడు ప్రకటనలు ఇచ్చే సీఎం కేసీఆరే నంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్లే తెలంగాణ వచ్చిందని స్ప‌ష్టం చేసిన ఆజాద్...``సీఎం కేసీఆర్ లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు... నాలుగేళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులే భర్తీ చేయలేదు. ఇంకా కొత్త ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేస్తారు? టీఆర్ ఎస్‌ ప్రభుత్వ పాలన చూసి తెలంగాణ ప్రజలు మేల్కొని ఉంటారు`` అని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణలో బీజేపీని తిడుతూ కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించిన ఆజాద్ ఈ సంద‌ర్భంగా గులాబీ పార్టీ ద‌ళ‌ప‌తిని త‌ప్పుప‌ట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ - తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌ లో మోడీ సర్కార్‌ కు మద్దతు పలుకుతూ పొత్తు లేద‌ని ఎలా చెప్ప‌గ‌ల‌ర‌ని ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నార‌న్నారు. ప్రభుత్వంలో ఎవరు ఉంటే వారితో ఎంఐఎం ఉంటుందని ఎద్దేవా చేశారు. వారసత్వ రాజకీయాలపై స్పందించిన ఆజాద్... ఇందిరా గాంధీని వాళ్ల తండ్రి నియమించలేదని - రాజీవ్ గాంధీని వాళ్ల తల్లి నియమించలేదన్నారు.