Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క అసెంబ్లీలో అపురూప దృశ్యం

By:  Tupaki Desk   |   19 May 2018 11:05 AM GMT
క‌ర్ణాట‌క అసెంబ్లీలో అపురూప దృశ్యం
X
సినిమాటిక్ మ‌లుపులు తిరిగిన క‌ర్ణాట‌క రాజ‌కీయం ఒక కొలిక్కి వ‌చ్చింది. అత్యాశ‌తో లేని బ‌లాన్ని ఉన్న‌ట్లు చూపించి.. ఏదోలా మేనేజ్ చేయాల‌ని భావించిన మోడీ ప‌రివారానికి ఓట‌మి త‌ప్ప‌లేదు. గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానంతో ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన య‌డ్యూర‌ప్ప త‌న రెండు రోజుల పాల‌న‌ను ముచ్చ‌ట‌గా మూడోరోజు ముగించారు.

సుప్రీం ఆదేశాల నేప‌థ్యంలో ఈ రోజు (శ‌నివారం) సాయంత్రం నాలుగు గంట‌ల‌కు బ‌ల‌ప‌రీక్ష‌ను నిరూపించుకోవాల‌ని చెప్ప‌గా.. త‌మ‌కు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత బ‌లం లేద‌న్న విష‌యాన్ని గుర్తించి.. బ‌ల‌ప‌రీక్ష‌లో ఓడిపోయే కంటే.. ముందుగానే తెల్ల‌జెండా ఊపేసి.. త‌న రాజీనామా ప్ర‌క‌ట‌న‌ను చేసి స‌భ నుంచి వెళ్లిపోయారు య‌డ్యూర‌ప్ప‌.

ఇదిలా ఉంటే.. ఈ రోజు క‌ర్ణాట‌క విధాన సౌథ‌లో అపురూప దృశ్యం ఒక‌టి క‌నిపించింది. స‌భ‌లో బీజేపీ స‌భ్యులు ఒక‌వైపు.. కాంగ్రెస్‌.. జేడీఎస్ స‌భ్యులు మ‌రోవైపు క‌త్తులు దూసుకుంటున్న‌ట్లుగా కూర్చుంటే..అందుకు పూర్తి భిన్న‌మైన సీన్.. అసెంబ్లీ గ్యాల‌రీలో క‌నిపించింది.

అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్న నేప‌థ్యంలో బ‌ల‌ప‌రీక్ష‌ను స్వ‌యంగా చూసేందుకు అధికార‌.. విప‌క్షానికి చెందిన నేత‌లు ప‌లువురు గ్యాల‌రీల్లో కూర్చున్నారు. రాజ‌కీయంగా త‌మ మ‌ధ్య శ‌త్రుత్వాన్ని ప‌క్క‌న పెట్టి ప‌క్క‌ప‌క్క‌నే కూర్చొని స‌ర‌దాగా న‌వ్వుకుంటూ మాట్లాడుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. స‌భ‌లో ఒక‌రిపై ఒక‌రు నిప్పులు చెరుగుతుంటే.. మ‌రోవైపు గ్యాల‌రీలో అదే పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు మాత్రం అందుకు భిన్నంగా స్నేహ‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టం చూస్తే.. ఇదో అపురూప‌మైన దృశ్యంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

అసెంబ్లీ గ్యాల‌రీలో కాంగ్రెస్ అగ్ర నేత‌లు గులాం న‌బి అజాద్‌.. అశోక్ గెహ్లాట్‌.. మ‌ల్లికార్జున ఖ‌ర్గేతో పాటు బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఆనంత్ కుమార్.. శోభా క‌రంద్లాజే.. స‌దానంద గౌడ త‌దిత‌రులు ఉన్నారు. వారంతా న‌వ్వులు చిందిస్తూ.. ఒక‌రినొక‌రు అభివాదాలు చేసుకోవ‌టం క‌నిపించింది. ఒక‌వైపు ఉద్రిక్త‌త‌.. మ‌రోవైపు ఉల్లాసం క‌నిపించింది క‌నువిందు చేసింది. ఈ త‌ర‌హా రాజ‌కీయం చాలా అరుదుగా మాత్ర‌మే ఆవిష్కృతం అవుతుంద‌ని చెప్ప‌ త‌ప్ప‌దు.