Begin typing your search above and press return to search.

కేసీఆర్ మార్క్ నిర్ణయంతో సమ్మె కొనసాగింపు

By:  Tupaki Desk   |   17 July 2015 4:03 AM GMT
కేసీఆర్ మార్క్ నిర్ణయంతో సమ్మె కొనసాగింపు
X
పదకొండు రోజులుగా సాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె విరమణకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. కార్మికుల డిమాండ్లలో కీలకమైన జీతాల పెంపు విషయంపై సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే.. సమ్మెను తమ సానుకూల నిర్ణయంతో ముగిసేలా చేయాల్సిన సర్కారు.. అందుకు భిన్నంగా పెట్టిన ఒక తిరకాసు సమ్మె యథాతథంగా మారేదుకు అవకాశం ఇచ్చింది.

కార్మికులు జీతాల పెంపు ప్రధాన డిమాండ్ తో సమ్మె చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పదకొండు రోజుల తర్వాత సానుకూల నిర్ణయాన్ని తీసుకున్నారు. జీతాల పెంపు విషయంలో 47 శాతం వరకూ పెంచేందుకు సుముఖంగా ఉన్నామని.. పెంచిన జీతం ఈ నెల నుంచే అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం కొన్ని తిరకాసులు పెట్టింది.

జీతాల పెంపు విషయంలో సానుకూలంగా స్పందిస్తూనే.. విభజించి.. పాలించు సిద్ధాంతానికి తెర తీసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు సమ్మె చేస్తుంటే.. పెంపు మాత్రం ఒక్క జీహెచ్ఎంసీ కార్మికులకు మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. సమ్మె కొనసాగేలా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది కార్మికులు సమ్మెచేస్తుంటే.. తాజాగా ప్రభుత్వం చెప్పిన పెంపు 24 వేల మంది కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. దీంతో..మిగిలిన కార్మికుల కోసం గ్రేటర్ పరిధిలోని 24 వేల మంది కార్మికులు సమ్మె కొనసాగించాల్సిన పరిస్థితి.

తిరకాసు నిర్ణయాల్లో మరొకటి.. సమ్మె విరమించి.. గురువారం నాటికి విధుల్లో చేరిన వారికి మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం.. కార్మిక సంఘాల ఆమోదం లాంటివి ఏమీ లేకుండా.. ఇరు వర్గాల మధ్య చర్చలు జరగకుండా.. ముఖ్యమంత్రి పేరిట విడుదలైన జీవోతో సమ్మెకు చెక్ చెప్పాలన్నట్లుగానే ఉంది తప్పంచి.. సమ్మెను సమిసిపోయేలా చేసే కమిట్ మెంట్ కనిపించని పరిస్థితి.

ఇక.. సమ్మెలో ఆందోళనలు చేసిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న ప్రభుత్వం నిర్ణయంపైనా కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సమ్మె సందర్భంగా హింసాత్మకంగా వ్యవహరించిన వారిని.. అనుచిత చర్యలకు పాల్పడిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. గురువారం నాడు విధుల్లో చేరని కార్మికుల్ని తొలగించి కొత్తవారిని నియమించాలన్న నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

జీతాల పెంపు విషయంలో పెద్ద మనసుతో వ్యవహరించినట్లు కనిపించినప్పటికీ.. ఆ ముసుగులో కార్మిక సంఘాల ఐక్యతను దెబ్బ తీసేలా ప్రభుత్వం ప్లాన్ చేసిందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. సమ్మె అందరూ చేసినప్పుడు.. ప్రయోజనం పరిమిత స్థాయిలో ఉండటం ఏమిటి? సమ్మె చేస్తున్న కార్మికుల మొత్తానికి పరిష్కారం చూపించాల్సింది పోయి.. కేవలం గ్రేటర్ పరిధిలోని కార్మికులకు మాత్రమే 47శాతం జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 47 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అందులోని తిరకాసులతో కార్మిక సంఘాలు సమ్మెను కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నాయి. సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన ఉన్న వారు.. ఇలాంటి తిరకాసు నిర్ణయాలు తీసుకోరన్న విమర్శ కార్మిక సంఘాల నుంచి వ్యక్తమవుతోంది. మరి.. ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.