Begin typing your search above and press return to search.

జీహెచ్ ఎంసీ ఎన్నికలే టీడీపీ, బీజేపీలకు ప్రాణం

By:  Tupaki Desk   |   30 Dec 2015 10:30 PM GMT
జీహెచ్ ఎంసీ ఎన్నికలే టీడీపీ, బీజేపీలకు ప్రాణం
X
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో టీడీపీ - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కనీసం డిపాజిట్ ను కూడా దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దాంతో తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని, టీడీపీ మటాష్ అంటూ అధికార టీఆర్ ఎస్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. తద్వారా జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీలపై మానసిక దాడిని మొదలుపెట్టింది.

తెలంగాణలో తమకు ఇంకా నూకలు ఉన్నాయని నిరూపించుకోవాలంటే టీడీపీ, బీజేపీలకు ఉన్న ఏకైక మార్గం జీహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రమే. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలూ కలిసి గౌరవప్రదమైన స్థానాలను సాధిస్తే భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో కనీసం ధైర్యంగా పోటీకి సిద్ధమయ్యే పరిస్థితులు ఉంటాయని ఆ పార్టీ నేతలే భావిస్తున్నారు.

వాస్తవానికి ఎన్నికలతో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూడా కాస్త గౌరవ ప్రదమైన స్థానాలను సాధించినా ఆ తర్వాత టీడీపీ నాయకులంతా కారు ఎక్కేశారు. దాంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బొక్క బోర్లా పడాల్సి వచ్చింది. దానికితోడు డబ్బులు భారీగా ఖర్చు పెట్టకపోవడమూ కారణమే. ఇక జీహెచ్ ఎంసీ పరిధిలో ఇటు టీడీపీకి, అటు బీజేపీకి నిర్దిష్ట ఓటు బ్యాంకు ఉంది. రెండు పార్టీలూ సమన్వయంతో పని చేయడమే కాకుండా ఓటర్లను గందరగోళానికి గురి చేయకుండా ఉంటే వాటికి మంచి స్థానాలే వస్తాయని విశ్లేషకులు వివరిస్తున్నారు.

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉనికి కోల్పోతున్న రెండు పార్టీలూ ఇప్పుడు హైదరాబాద్ లో పట్టు నిరూపించుకుంటే ఇది గ్రామీణ ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అయితే ఇరు పార్టీల నాయకులూ కలిసి పని చేయడం ఎంత వరకూ సాధ్యమవుతుందన్నదే ఇప్పటి ప్రశ్న.