Begin typing your search above and press return to search.

కేసీఆర్ క‌ల‌ను క‌ల్ల చేసిన ఈసీ

By:  Tupaki Desk   |   12 Dec 2015 5:43 AM GMT
కేసీఆర్ క‌ల‌ను క‌ల్ల చేసిన ఈసీ
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొద‌టి షాక్ త‌గిలింది. బ‌ల్దియా ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ససేమిరా అని చెప్పిన కేసీఆర్ చివ‌ర‌కు కోర్టుల తీర్పుతో ఇందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో త‌న ప్ర‌చార ప‌ర్వం ప‌రిస‌మాప్తం చేసి..ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను విజ‌య‌వంతంగా ముగించుకున్న త‌ర్వాతే గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే సీమాంధ్రులను ఓటు హ‌క్కుకు దూరం చేసేలా జ‌న‌వ‌రి 17న ఎన్నిక‌లు ఉండే అవకాశం ఉన్న‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. ఈతేదీన ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే....మెజార్టీ సీమాంధ్రులు దూరంగా ఉండ‌టం వ‌ల్ల గ్రేట‌ర్‌లో కారు జోరు కొన‌సాగుతుంద‌ని భావించారు. అయితే ఇందుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ బ్రేకులు వేసిన‌ట్లు స‌మాచారం.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఉన్న ఆంధ్రా వాసులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పండుగ సెలవుల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. జనవరి మొదటి వారంలో షెడ్యూలు విడుదల చేయాలని, జనవరి 23న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు.దీంతో పాటు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు సంక్రాంతి సమయంలో శబరిమలైకి వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. వీరందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ తేదీ ఉండాలని ఎన్నికల సంఘం ప్రాథమికంగా కసరత్తు చేసింది. మొత్తంగా బ‌ల్దియా ఎన్నిక‌ల‌ను జనవరి మూడో వారంలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది.

ఈ పరిణామం టీఆర్ఎస్ ప‌రంగా చూస్తే ఒక‌ర‌కంగా ఇబ్బందిక‌ర‌మే. సంక్రాంతి మ‌రుస‌టి రోజు, ముక్క‌నుమ రోజును లెక్క‌లేసుకొని గెలుపుపై ధీమా పెట్టుకున్న టీఆర్ఎస్‌కు ఈ అప్‌డేట్‌తో ఎన్నిక‌ల క‌మిష‌న్ క‌ల‌ను చెదిపిన‌ట్లే అవుతుంద‌ని భావిస్తున్నారు. వ‌రుస విజ‌యాల‌తో ఊపుమీదుండి...గ్రేట‌ర్ జ‌య‌కేతనంపై గంపెడాశ‌ల‌తో ఉన్న కేసీఆర్‌కు మొద‌టి షాక్ అవుతుంద‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్ వ్యాఖ్యానిస్తోంది.