Begin typing your search above and press return to search.

డిసెంబరులో జీహెచ్ఎంసీ ఎన్నికలు?

By:  Tupaki Desk   |   9 Sept 2020 11:30 AM IST
డిసెంబరులో జీహెచ్ఎంసీ ఎన్నికలు?
X
గ్రేటర్ కోటను మరోసారి సొంతం చేసుకోవాలని భావిస్తోంది టీఆర్ఎస్. దీనికి సంబంధించి ఇప్పటికే పక్కా ప్లాన్ రూపొందించిన గులాబీ అధినాయకత్వం అందుకు తగ్గట్లే.. వ్యూహ అమలుకు రంగాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఫిబ్రవరి పదికి గ్రేటర్ పదవీ కాలం పూర్తి కానుంది. చట్టంలోని నిబంధన ప్రకారం.. పదవీ కాలం ముగియటానికి మూడు నెలల ముందే ఎన్నికల్ని నిర్వహించుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సానుకూలతల్ని ఆధారంగా చేసుకొని కీలకమైన గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే డిసెంబరు మూడో వారంలో షెడ్యూల్ విడుదల కావటమే కాదు.. ఆ వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ నోట గ్రేటర్ ఎన్నికల ముచ్చట రావటమే కాదు.. పరిస్థితి తమకు సానుకూలంగా ఉందని.. ఈసారి ఎన్నికల్లో సెంచరీ దాటేయటం ఖాయమని చెబుతున్నారు.

ఇప్పటికే నాలుగు సర్వేలు నిర్వహించగా.. అన్ని సర్వేల్లోనూ 95 సీట్లకు ఏ మాత్రం తగ్గవని.. గరిష్ఠంగా 110 సీట్లను సొంతం చేసుకునే వీలుందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో తన సీట్లను తాను సొంతం చేసుకోవటంలో ఎంఐఎంకు ఎలాంటి అనుమానాలు లేవు. మిగిలిన సీట్లను సొంతం చేసుకోవటంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందు ఉంటుందని సీఎం కేసీఆర్ అంచనా వేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో హైదరాబాద్ నగర ప్రజల మనసుల్ని దోచే వివిధ పథకాలు తెర మీదకు రానున్నట్లు తెలుస్తోంది.