Begin typing your search above and press return to search.

గ్రేట‌ర్ పోల్ డేట్ ఫిక్స‌యింది​

By:  Tupaki Desk   |   2 Jan 2016 10:46 AM GMT
గ్రేట‌ర్ పోల్ డేట్ ఫిక్స‌యింది​
X
తెలుగు రాష్ర్టాల్లో ప్ర‌స్తుతం విప‌రీత‌మైన ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలే. అన్ని పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జీహెచ్‌ ఎంసీ పోరులో పోలింగ్ ఎప్పుడు జ‌రుగుతుంద‌నేది ఉత్కంఠ‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన ప్ర‌కారం జీహెచ్‌ ఎంసీ ఎన్నికల ప్రక్రియను ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ఈ తేదీలోపు ఎన్నిక ప్రక్రియను పూర్తిచేసి తిరిగి ఈ సమాచారాన్ని కోర్టుకు తెలియపర్చ‌డం త‌ప్ప‌నిస‌రి.

తాజాగా జ‌రుగుతున్న‌ మంత్రిమండలి సమావేశంలో చ‌ర్చ‌కొస్తున్న అంశాల ప్ర‌కారం జీహెచ్‌ ఎంసీ ఎన్నికలు, వార్డుల రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నోటిఫికేషన్‌ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈనెల 30వ తేదీ పోలింగ్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేసి పది రోజులపాటు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. 15వ తేదీలోపు నామినేషన్ల ఘట్టం పూర్తిచేసి ఆ తర్వాత రెండు రోజులపాటు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటిఫికేషన్‌ వెలువడ్డ నాటినుంచి 25 రోజుల్లో ఎన్నికలను నిర్వహించవచ్చన్న నిబంధనలు ఉన్నందున 4వ తేదీన నోటిఫికేషన్‌ జారీచేస్తే 29వ తేదీలోపు ఎప్పుడైనా ఎన్నికలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జనవరి 30వ తేదీ శనివారం కావడంతో ఆ రోజున ఎన్ని కలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 31వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసి ఫిబ్రవరి మొదటి వారంలో మునిసిపల్‌ కార్పొరేషన్‌ పూర్తిస్థాయిలో కొలువుదీరే విధంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

గ్రేటర్‌ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికారపక్షమైన తెరాస ఇప్పటికే నగర ప్రజలకు అనేక హామీలను గుప్పించింది. మంత్రిమండలి సమావేశంలో మరిన్ని హామీలను ఇవ్వాలన్న సంకల్పంతో ప్రభుత్వముంది. విపక్ష పార్టీలను ఎదుర్కొనేందుకు ఎటువంటి హామీలిస్తే బాగుంటుందన్న అంశంపై సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ సహచరులతో చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో యుద్ధప్రాతిపదికన చేపడతామన్న హామీని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీలో నల్లా బిల్లులు, కరెంటు బిల్లులను ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ (బీఆర్‌ ఎస్‌), ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ ఆర్‌ ఎస్‌)కు సంబంధించి కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నట్టు సమాచారం. గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు విపక్ష పార్టీలైన‌ కాంగ్రెస్‌, తెదేపా, భాజపా, ఎంఐఎం, ఎంబీటీలు అధికార‌పార్టీని ఎండ‌గ‌ట్టే ప‌నిలో నిమగ్నమయ్యాయి.