Begin typing your search above and press return to search.

ఆఖరి గంటలో 10 శాతం పోలింగ్ ఎలా సాధ్యమైందబ్బా?

By:  Tupaki Desk   |   3 Dec 2020 3:00 PM IST
ఆఖరి గంటలో 10 శాతం పోలింగ్ ఎలా సాధ్యమైందబ్బా?
X
గ్రేటర్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ మంగళవారం జరగటం తెలిసిందే. గతానికి మించి.. ఈసారి ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన సమాచారం.. వివరాలు గందరగోళంగా ఉండటమే కాదు.. వాస్తవానికి దూరంగా ఉన్నాయన్న విమర్శలు.. ఆరోపణలు చోటు చేసుకున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు సాగింది. ఉదయం మందకొడిగా మొదలై..మధ్యలో అస్సలుజనాలు లేకుండా పోయిన ఈ పోలింగ్.. సాయంత్రం చివరి గంటలో భారీగా నమోదైనట్లుగా అధికారులు చెబుతున్న గణాంకాలు ఇప్పుడు కొత్త సందేహాలకు.. అనుమానాలకు తావిస్తోంది. అయితే.. అధికారులు చేసిన తప్పులు.. ఇప్పుడు ప్రజల్లో కొత్త చర్చకు తావిచ్చిందని చెప్పాలి.

ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు వరకు 36 శాతం వరకు పోలింగ్ జరిగినట్లుగా పేర్కొన్నారు. అనంతరం రాత్రి 10 గంటల వేళలో 43 శాతం వరకు పేర్కొన్న అధికారులు.. అర్థరాత్రి దాటిన తర్వాత మాత్రం 45.71 శాతంగా వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం తాము చెప్పిన సమాచారాన్ని సరి చేసిన అధికారులు చివరకు 46.55గా లెక్క తేల్చారు. ఎందుకింత గందరగోళం? ఎందుకిన్ని మార్పులు చేర్పులు? అన్నది ప్రశ్నగా మారింది.

పోలింగ్ కేంద్రాల్లో పని చేసే బాధ్యతను సాధారణంగా టీచర్లకు అప్పజెబుతుంటారు. అందుకు భిన్నంగా ఈసారి వివిధ శాఖల ఉద్యోగులకు ఈ బాధ్యతను అప్పజెప్పారు. దీంతో.. పలువురికి పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఫారాల్ని నింపే విషయంలో చోటు చేసుకున్న తప్పులు.. ఈ మొత్తం గందరగోళానికి కారణంగా మారింది. అయితే.. అధికారపక్ష నేతలు రిగ్గింగ్ కారణంగానే పోలింగ్ చివర్లో పెరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నా.. ఆ వాదనలో ఏ మాత్రం నిజం లేదని చెప్పాలి.

ఎందుకంటే.. గ్రేటర్ పరిధిలోని 9 వేలకు పైగా పోలింగ్ బూత్ లు ఉన్నప్పుడు రిగ్గింగ్ జరిగితే.. దాన్ని దాచి పెట్టటం అంత తేలికైన విషయం కాదు. అందునా డేగకళ్లు వేసుకొని.. ఎక్కడ ఏం తప్పు జరిగితే అడ్డుకోవాలన్న కసితో బీజేపీ నేతలు.. కార్యకర్తలు పని చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న తేడా వచ్చినా.. ఆగమాగం చేసే పరిస్థితి. వాస్తవానికి పోలింగ్ శాతం నమోదులో ఆలస్యం చేసుకోవటానికి కారణం పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం.. అవగాహన రాహిత్యమే ఈ గందరగోళానికి కారణంగా చెప్పాలి.

ప్రతి రెండు గంటలకు సమాచారాన్ని ఇవ్వాల్సిన సమయంలో తప్పుగా చెప్పటంతోనే అసలు సమస్యగా చెబుతున్నారు. దీంతో.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ శాతాన్ని తప్పుల తడకగా నమోదు చేయటంతో.. చివర్లో వాటిని సరి చూసుకొని ఫైనల్ లెక్కలో అన్నింటిని సర్దుబాటు చేశారు. దీంతో..సాయంత్రం చివరి గంటలోనే.. తేడా ఉన్న పోలింగ్ ను అంకెల్లో సర్దుబాటు చేశారు. ఈ కారణంతోనే తేడా కొట్టొంది. అంతేకానీ.. రిగ్గింగ్.. బ్యాలెట్ బ్యాక్సుల్లో ఏదో చేశారంటూవినిపిస్తున్న మాటల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పక తప్పదు.